Special Trains : ప్రయాణికులకు గమనిక.. దీపావళి సందర్భంగా అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే
Special Trains : దీపావళి పండగ నేపథ్యంలో.. రైళ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. దీంతో ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి పలు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నారు. ఈ రైళ్ల సేవలను వినియోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు.
దీపావళి పండగ సందర్భంగా.. ప్రత్యేక రైళ్లను నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ఈ పండగ సీజన్‌లో పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలకు భారీగా ట్రాఫిక్ ఉంటుంది. రద్దీని తగ్గించడానికి స్పెషల్ ట్రైన్స్‌ను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. దీపావళి, ఛత్ పండగల నేపథ్యంలో.. మొత్తం 804 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
సౌత్ సెంట్రల్ రైల్వేలోని ప్రధాన స్టేషన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ నుండి ఇతర రాష్ట్రాలలోని షాలిమార్, రాక్సాల్, జైపూర్, లాల్‌ఘర్, హిసార్, గోరఖ్‌పూర్, షిర్డీ, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తల, సంత్రాగచ్చి వంటి స్టేషన్‌లకు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. మదురై, ఈరోడ్, నాగర్‌కోయిల్, కొల్లాం, బెంగళూరు, పన్వేల్, దాదర్ స్టేషన్లను కూడా స్పెషన్ ట్రైన్స్ నడపనున్నారు.
ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ, నాన్- ఏసీ క్లాసుల అందుబాటులో ఉంటాయి. అన్ని వర్గాల ప్రయాణికులకు సేవలందించేందుకు రిజర్వ్‌డ్, అన్ రిజర్వ్‌డ్ సౌకర్యం కల్పించామని.. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వివరించారు.
కాజీపేట మీదుగా..
07003 నంబర్‌తో సికింద్రాబాద్- పాట్నా మధ్య ఈనెల 26, వచ్చేనెల 2, 9వ తేదీల్లో ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు పాట్నా చేరుకుంటుంది. 07004 నంబర్‌తో తిరుగు ప్రయాణంలో ఈ రైలు పాట్నాలో బయలుదేరుతుంది. ఈనెల 28, వచ్చేనెల 4, 11వ తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
07649 నంబర్‌తో మౌలాలి- ముజఫర్‌పూర్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నారు. ఈనెల 28, వచ్చే నెల 4, 11వ తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. మౌలాలిలో సోమవారం సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు బయలుదేరి.. బుధవారం ఉదయం 2 గంటల 30 నిమిషాలకు ముజఫర్‌పూర్ చేరుకుంటుంది.
07650 నంబర్‌తో ఈ రైలు తిరుగు ప్రయాణం అవుతుంది. ఈనెల 30, వచ్చే నెల 6, 13వ తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ముజఫర్‌పూర్‌లో బుధవారం ఉదయం 4 గంటల 50 నిమిషాలకు బయలుదేరుతుంది. గురువారం సాయంత్ర 7 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో దీన్ని లింగంపల్లి వరకు పొడిగించారు.