Challa Sreenivasulu Setty : ఎస్బీఐ ఛైర్మన్ గా తెలుగు వ్యక్తి శ్రీనివాసులు శెట్టి నియామకం- ఏపీ,తెలంగాణ సీఎంలు హర్షం
Challa Sreenivasulu Setty : ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ నూతన ఛైర్మన్ గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులయ్యారు. ఆయన నియామకంపై రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
Challa Sreenivasulu Setty : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నూతన ఛైర్మన్ గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులయ్యారు. ఆయన నియామకంపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. చల్లా శ్రీనివాసులు ఎస్బీఐ ఛైర్మన్ కావడం ఎంతో ఆనందంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. తెలుగు వ్యక్తి ప్రముఖ స్థానాన్ని పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయనను అభినందిస్తున్నానన్నారు. చల్లా శ్రీనివాసులు పదవీకాలం చాలా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి హర్షం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జోగుళాంబ గద్వాల్ జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన ఎస్‌బీఐ ఛైర్మన్ పదవిని అధిరోహించడం ఒక మహత్తర సందర్భమని వ్యాఖ్యానించారు. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుకు నూతనంగా నియమితులైన ఛైర్మన్‌కి తెలంగాణ రాష్ట్రం తరపున రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శ్రీనివాసులు తన కొత్త పాత్రలో అనేక విజయాలు, ప్రశంసలతో పాటు పదవీకాలం కొనసాగాలని సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.
బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరింప జేయాలి-పవన్
ఎస్బీఐ ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బోర్డు సిఫార్సు చేయడం తెలుగువారందరికీ ఎంతో గర్వ కారణమని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీనివాసులు శెట్టికి అభినందనలు తెలిపారు. ఆయన నేతృత్వంలో ఎస్బీఐ మరెన్నో మైలురాళ్లు అందుకోవాలని పవన్ ఆకాంక్షించారు. క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు కూలీలు, చిరు వ్యాపారుల సాదకబాధకాలు తెలిసిన శ్రీనివాసులు శెట్టి, ఆయా వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరింప చేయాలని ఆకాంక్షించారు. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నూతన ఛైర్మన్‌గా నియమితులవుతున్న తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టికి హార్ధిక శుభాకాంక్షలు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో పోస్టు పెట్టారు.
తెలుగు వ్యక్తి
చల్లా శ్రీనివాసులు శెట్టి జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతుల పాడులో జన్మించారు. పాలమూరు ఆలంపూర్ తాలుకాలో ప్రాథమిక పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత గద్వాలలో హైస్కూల్, ఇంటర్ చదువుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. 1988లో ఎస్బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యారు. ముందుగా గుజరాత్ అహ్మదాబాద్‌లో పనిచేసిన ఆయన, హైదరాబాద్, ముంబాయిలో పనిచేశారు. శ్రీనివాసులు శెట్టికి బ్యాంకింగ్ రంగంలోనే 35 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
ఎస్బీఐలో పనిచేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ల నుంచి ఛైర్మన్ ను నియమిస్తారు. దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ)కి FSIB ఒకరి పేరును సిఫార్సు చేస్తుంది. ఏసీసీకి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తున్నారు. FSIBకి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) మాజీ సెక్రటరీ భాను ప్రతాప్ శర్మ నేతృత్వం వహిస్తున్నారు. FSIB సభ్యులుగా ఆర్థిక సేవల కార్యదర్శి, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ కార్యదర్శి, ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ ఉంటారు.
సంబంధిత కథనం