Ration Card e- KYC Last Date : ఈకేవైసీ పూర్తి చేశారా..? దగ్గరపడిన గడువు, అప్డేట్ చేయకపోతే ‘రేషన్’ కట్..!
Ration Card e- KYC in Telangana: తెలంగాణలో రేషన్ కార్డు ఈకేవైసీ అప్డేట్ ప్రక్రియ గడువు దగ్గరపడింది. జనవరి 31వ తేదీతో ముగియనుంది. త్వరలో కొత్త కార్డులు మంజూరు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో… ఈకేవైసీ ప్రక్రియ కూడా కీలకంగా మారింది.
Ration Card e- KYC in Telangana: తెలంగాణలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు కూడా దగ్గరపడింది. మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. జనవరి 31వ తేదీతో సమయం ముగియనున్న నేపథ్యంలో… ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకపోతే వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోసారి గడువు పెంచే అవకాశం కూడా లేదని తెలుస్తోంది.
గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో ఈ-కేవైసీ అప్డేట్ చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ కోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలను సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు కట్ చేసే అవకాశం ఉంది. ఫలితంగా రేషన్ లబ్దిదారులు జనవరి 31వ తేదీ లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ కు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉచితంగా రేషన్ అందిస్తోంది. అయితే బోగస్ రేషన్ కార్డులను ఏరివేతకు రేషన్ కార్డుతో ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. చాలా పాత కార్డుల్లో చనిపోయిన వాళ్ల పేర్లు అలాగే ఉన్నాయి. దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయి. వీటికి చెక్ పెట్టేలా ఈకేవైసీ ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారు. కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజారు కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈకేవైసీ పూర్తి అయిన తర్వాత…. లబ్ధిదారుల విషయంలో మరింత స్పష్టత రానుంది. ఈ డేటాను కూడా పరిగణనలోకి తీసుకోనుంది సర్కార్. ఈ ప్రక్రియ పూర్తికాగానే… కొత్త రేషన్ కార్డుల మంజారు ప్రక్రియను వేగవంతం చేయనుంది.
ఈకేవైసీ అప్డేట్ ఎలా?
Ration Card E KYC Process: రేషన్ కార్డు ఈకేవైసీ అప్డేట్ చేసుకోవడానికి రేషన్ కార్డులోని కుటుంబ యజమానితోపాటు కుటుంబ సభ్యులందరూ... రేషన్ షాపు వద్దకు వెళ్లి ఈ పాస్ మిషన్‌లో వేలిముద్రలు వేయాలి.
వేర్వురుగా రేషన్ కార్డు షాప్ కు వెళ్తే ప్రాసెస్ చేయరు.
వేలిముద్రలు వేసిన అనంతరం లబ్దిదారుల ఆధార్ కార్డు నంబర్, రేషన్ కార్డు నంబర్ ఈపాస్ లో డిస్‌ప్లే అవుతుంది.
ఈ-పాస్ మిషన్ లో గ్రీన్ లైట్ వచ్చి ఈకేవైసీ అప్డేటేడ్ అని వస్తుంది.
ఒకవేళ రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే లబ్దిదారుడి రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు సరిపోలడం లేదని అర్థం. దీంతో ఆ రేషన్ కార్డును తొలగిస్తారు.
రేషన్ కార్డులో పేర్లు ఉన్న వారంతా ఒకేసారి ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలి.
సంబంధిత కథనం