TS Ration Card EKYC: ఈకేవైసీలో వలస కార్మికులు, పిల్లలకు ఇబ్బందులు
TS Ration Card EKYC: రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరికి ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో చిన్నారులు, వలస కార్మికలకు ఇబ్బందులు తప్పడం లేదు. సెప్టెంబర్ నెలాఖరులోగా కార్డులో పేర్లు ఉన్న వారంతా ఈకేవైసీలు పూర్తి చేయాలనడంతో కేంద్రాల ముందు పడిగాపులు కాస్తున్నారు.
TS Ration Card EKYC:నెలాఖరులోగా రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారంతా EKYC (Electronic Know Your Customer) చేయించుకోవాలని భారత ప్రభుత్వం స్పష్టం చేయడంతొో చిన్న పిల్లలు, వలస కార్మికులు తమ పేర్లు రేషన్ కార్డుల నుండి తొలగిస్తారని ఆందోళన చెందుతున్నారు.
రేషన్ షాప్‌లలో ఉన్న POS మెషిన్లలో వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలంటే, వారి వేలిముద్రలు ఆధార్ కార్డుల్లో కూడా నమోదై ఉండాల్సి ఉంది. చాలామంది చిన్న పిల్లల వేలిముద్రలు అప్డేట్ చేయకపోవడంతో వారి పేర్లు రేషన్ కార్డు నుండి తీసివేస్తారని వారి తల్లి తండ్రులు భయపడుతున్నారు.
పది సంవత్సరాలు దాటిన వారందరికి ఆధార్ కార్డుల్లో కూడా వేలిముద్రలు అప్డేట్ చేసుకొని ఉంటేనే రేషన్ షాపులో EKYC చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన పేద కార్మికులు, దేశంలోని వేరు వేరు ప్రాంతాలకు పొట్ట కూటికోసం పని వెతుక్కుంటూ వెళ్లిన వారు, స్వస్థలాలకు తిరిగి వచ్చి మరి EKYC చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దేశంలో వేరు వేరు ప్రాంతాల్లో ఉంటున్నవలస కార్మికులు స్వంత ప్రాంతాలకు తిరిగి వచ్చి EKYC అప్డేట్ చేసుకుంటున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు రావాలంటే మాత్రం లక్షలు లక్షలు ఖర్చు పెడితే తప్ప రాలేని పరిస్థితి ఉంది. ఇక రేషన్ కార్డులు ఉన్నవారంతా పొద్దున్నే పిల్లలని, వృద్ధులని ఆధార కార్డు వేలిముద్రల కోసం అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలు, రేషన్ షాపుల వద్ద EKYC అప్డేట్ కోసం లైన్లు కడుతున్నారు.
ఉదయం ఆరుగంటల నుండి, రాత్రి వరకు రేషన్ షాపులు, ఆధార్ సెంటర్ల విపరీతమైన జనం కనిపిస్తున్నారు. రేషన్ కార్డు లేకపోతె, తాము ఆరోగ్యశ్రీ కార్డు, ఆసరా పెన్షన్ , ఇతరప్రయోజనాలు కోల్పోతామని రేషన్ కార్డు దారులు భయ పడుతున్నారు. ఆ భయంతోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లలో నిలబడుతున్నామని చెబుతున్నారు.
ఈకేవైసీ గడువు పొడిగించడం లేదా EKYC చేయకున్నా ఇప్పటికిప్పుడే రేషన్ కార్డుల్లో పేర్లు తీసేయమనే స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల నుంచి సృష్టమైన ప్రకటన రాకపోవడం, లబ్ధిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 30 శాతం వరకు మాత్రమే EKYC అప్డేట్ అయ్యింది అని, అందరికి ఒకేసారి వివరాలు అప్డేట్ చేయాలన్నా సరైన ఆధార్ సెంటర్లు కానీ, రేషన్ షాపుల్లోనూ సరైన వనరులు లేవని రేషన్ షాప్ డీలర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఎలాగైనా EKYC గడువు తేదీ పొడగించాలని కోరారు. EKYC అప్డేట్ చేయకపోయినా ప్రభుత్వం లబ్దిదారులకు నెలవారీ రేషన్ ఇస్తామనే భరో ఇవ్వాలన్నారు.