TSPSC Group 4 : తెలంగాణ గ్రూప్‌-4 ఎగ్జామ్... 'బలగం' సినిమాపై ప్రశ్న-question on balgam movie in tspsc group 4 exam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 4 : తెలంగాణ గ్రూప్‌-4 ఎగ్జామ్... 'బలగం' సినిమాపై ప్రశ్న

TSPSC Group 4 : తెలంగాణ గ్రూప్‌-4 ఎగ్జామ్... 'బలగం' సినిమాపై ప్రశ్న

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 01, 2023 02:04 PM IST

TSPSC Group 4: తెలంగాణలో గ్రూప్‌-4 పరీక్ష ప్రారంభమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జనరల్ స్టడీస్ పేపర్ పరీక్ష జరిగింది. ఇక పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న అడిగింది.

తెలంగాణ గ్రూప్ - 4 పరీక్ష
తెలంగాణ గ్రూప్ - 4 పరీక్ష

TSPSC Group 4 Exam: తెలంగాణలో ఆదివారం గ్రూప్‌-4 పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1 పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష మొదలైంది. ఇక పేపర్ -1లో తెలంగాణకు సంబంధించి అనేక ప్రశ్నలు రాగా...ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభించిన 'బలగం' సినిమా నుంచి ప్రశ్న అడిగారు. 'బలగం చిత్రానికి సంబంధించి కింది జతలలో ఏవి సరైనవి అంటూ …. సినిమా నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, కొమరయ్య పాత్ర పేర్లను ప్రస్తావించారు.

 గ్రూప్ - 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న
గ్రూప్ - 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న

మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్షను అభ్యర్థులు రాయనున్నారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించలేదు. ఇక గ్రూప్‌ -4 పరీక్ష రాస్తూ సెల్‌ఫోన్‌తో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. సరూర్‌నగర్‌లోని ఓ కళాశాలలో ఈ ఘటన జరిగింది. అభ్యర్థి నుంచి ఫోన్‌ తీసుకుని సీజ్‌ చేశారు. మాల్‌ ప్రాక్టీస్‌ కింద అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గ్రూప్‌-4 సర్వీసు పోస్టులకు భారీగా దరఖాస్తులు చేసుకున్న సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీ చరిత్రలో ఈ స్థాయిలో దరఖాస్తు చేయడం ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు. 2018లో 700 వీఆర్వో ఉద్యోగాలకు 10.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో 7.9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లా స్థాయిలో పోస్టులు కావడంతో పోటీపడుతున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రూప్-4 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబరు 2న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు అప్లికేషన్లు స్వీకరించారు.

గ్రూప్ 4 మొత్తం ఖాళీల సంఖ్య 8,180 కాగా... ఇందులో జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429, ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238, జూనియర్ అసిస్టెంట్ 5730 పోస్టులు , జూనియర్ ఆడిటర్ పోస్టులు 18 , వార్డ్ ఆఫీసర్ పోస్టులు 1862 ఉన్నాయి. ఈ పరీక్షను మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష లేదా ఓంఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహించనున్నారు. గ్రూప్-4 పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్)- 150 మార్కులకు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)-150 మార్కులకు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు.

Whats_app_banner