TS Gruha Lakshmi : 'గృహలక్ష్మి' స్కీమ్ అప్డేట్... తెల్లకాగితంపై రాసి దరఖాస్తు ఇవ్వొచ్చు
TS Gruha Lakshmi Applications:తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకానికి సంబంధించిన దరఖాస్తుల విషయంలో గందరగోళంగా మారింది. దరఖాస్తు చేసుకునేందుకు పలు రకాల ఫారమ్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తెల్ల కాగితంపై కూడా రాసి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
Telangana Gruha Lakshmi Scheme : సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి స్కీమ్ కోసం తెలంగాణ వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మండల స్థాయిలో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడంతో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. అయితే పలు జిల్లాల్లో అధికారికంగా ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పటికీ... మరికొన్ని జిల్లాల్లో దరఖాస్తుల విషయంపై గందరగోళం నెలకొంది. అయితే ఇందుకు సంబంధించి మంత్రులు పలు ప్రకటనలు చేసినప్పటికీ… స్పష్టత కరువైంది.
గృహలక్ష్మి పథకానికి సంబంధించిన పలు దరఖాస్తులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈనెల 10వ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలంటూ పలు జిల్లాల కలెక్టర్లు అధికారికంగా ఆదేశాలు ఇచ్చారు. కానీ పలు జిల్లాల్లో ఈ తేదీని ఆగస్టు 12వ తేదీకి పొడిగించారు. ఇక దరఖాస్తు నమూనా పత్రాలు కూడా వేర్వురుగా ఉన్నాయి. సాధారణంగా ఓ పథకం తీసుకొస్తే... దరఖాస్తు నమూనా ఒకేలా ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే... చాలా మండలాల్లో అందుకు భిన్నంగా ఉంది . ఒక్కో చోట ఒక్కో విధంగా దర్శనమిస్తున్నాయి. అయితే గృహలక్ష్మి స్కీమ్ కు సంబంధించి ప్రత్యేకమైన ఫారమ్ అంటూ లేదని అధికారులు చెబుతున్నారు. తెల్లకాగితంపై కూడా దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గృహలక్ష్మి కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ అంటూ ఏది లేదని.. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫారమ్స్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన వారు తెల్లకాగితంపై రాత పూర్వకంగా దరఖాస్తు రాసిచ్చినా సరిపోతుందని చెప్పుకొచ్చారు.
ఆహార భద్రత కార్డు(రేషన్ కార్డు), ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డును జతపరిచి, స్థానిక తహసీల్దార్‌కు సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత తహసీల్దార్లు కలెక్టర్లకు సమర్పిస్తారని చెప్పారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కానీ, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ లేకపోయినా, ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.
మార్గదర్శకాలు ఇవే….
సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
వంద శాతం రాయితీతో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారులకు సాయం అందిస్తారు.
రాష్ట్ర రిజర్వు కోటాలో 43 వేల మందికి, మొత్తంగా 4 లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం అందనుంది.
కలెక్టర్లు, కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. మహిళల పేరు మీదే ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి.
జన్‌ధన్ ఖాతాను వినియోగించవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రెండు గదులతో ఆర్‌సీసీ ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటి బేస్ మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం సాయం చేస్తుంది.
ఆహార భద్రత కార్డు, సొంత స్థలం ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. ఇప్పటికే ఆర్‌సీసీ ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వులు కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు.
4 లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి 3 వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తారు.
ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను సెలెక్ట్ చేయాలని మార్గనిర్దేశాల్లో ప్రభుత్వం తెలిపింది. దివ్వాంగులకు కూడా ఐదు శాతం రిజర్వేషన్లను ప్రకటించింది ప్రభుత్వం