Gruha Lakshmi Scheme : గృహలక్ష్మి పథకం అర్హులకు కొత్త చిక్కులు, నిబంధనలు సడలించాలని సోషల్ మీడియాలో పోస్టులు
Gruha Lakshmi Scheme : తెలంగాణ ప్రభుత్వం సదుద్దేశంతో తెచ్చిన గృహలక్ష్మి పథకం నిబంధనలతో క్షేత్రస్థాయిలో నిజమైన అర్హులు లబ్దిపొందలేకపోతున్నారని అంటున్నారు. కొందరు నెటిజన్లు ఈ విషయంపై పలు సందేహాలు లేవనెత్తుతున్నారు. నిబంధనలు సడలించాలని కోరుతున్నారు.
Gruha Lakshmi Scheme : సొంగ జాగా ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారి కోసం తెలంగాణ సర్కారు గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తుంది. గృహలక్ష్మి పథకం నిబంధనలపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గృహలక్ష్మి పథకం నిలువ నీడ లేని ఎంతో మంది నిరు పేదల కోసం ఉద్దేశించబడిందని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి
పథకం లో ముఖ్యమైన పాయింట్ గృహ లక్ష్మి పథకం కింద లబ్ది పొందాలి అంటే ముందు ఆ లబ్ది దారుడి పేరిట హౌస్ సైట్ అనేది ఉండాలి. కానీ గ్రామాల్లో నివాస భూముల్లో కొన్ని రకాలు ఉంటాయి
1) అబాది లేదా గ్రామకంఠం భూములు వీటికి సర్వే నంబర్లు ఉండవు తాత ముత్తతల నుండి ఈ భూముల్లో ఇళ్ళు కట్టుకుని నివాసం ఉంటున్నారు గ్రామాల్లో మెజారిటీ ఈ రకమే నివాస భూములు
2) ముందు వ్యవసాయ భూముల కింద ఉండి తరువాత వ్యవసాయేతర భూములుగా మార్చుకుని నివాసం ఉంటున్న ఇళ్ళు
3) ప్రభుత్వం ద్వారా గతంలో మంజూరు చేయబడిన అసైన్డ్ భూములు
గ్రామకంఠం భూముల్లో ఉన్న ఇళ్లు... తాతల పేర్ల మీద ఉంటాయి. ఇవి శిథిలం అవడంతో వారసులు వేరే చోట కిరాయికి ఉండడమో లేదా శిథిలం అయినా ఇళ్లనే కొంచం రిపేర్ చేసుకుంటూ నివాసం ఉండడమో లేదా ఆ శిథిలం అయినా ఇళ్లను మొత్తం తొలగించి అదే ప్లేస్ లో గుడిసెలు వేసుకుని నివాసం ఉండే వాళ్లు ఎక్కువగా ఉంటారు. ఆ శిథిలమైన ఇంట్లోనో లేదా ఆ జాగాలో బతికే ఆ ఇంటి వారసుడి పేరిట ఆ జాగా ఉండదు, వాళ్ల తాత ముత్తాతల పేరుపై మీదో లేదా వాళ్ల తల్లిదండ్రుల పేరు మీదో రికార్డుల్లో ఉంటుంది. ఆ ఇంటి యజమానులు బతికి ఉండరు కాబట్టి వారి కుమారులో, మనవలో వారసత్వంగా ఆ భూమిని అనుభవిస్తూ వస్తుంటారు.
ఇళ్ల మార్పిడి సమస్య
ఆ ఇళ్లను లేదా ఖాళీ స్థలాలను వారసులు వాళ్ల పేర్ల మీద మార్చుకుని అప్లై చేసుకోవచ్చు కదా అని చాలా మందికి సందేహం ఉంటుంది. కానీ అది అంత సులభం కాదు, చనిపోయిన తాత ముత్తాతల పేర్ల లేదా చనిపోయిన తల్లిదండ్రుల పేర్ల మీద ఉన్న ఇళ్లను గ్రామపంచాయతీలో మార్చుకోవాలి అంటే చనిపోయిన వారికి ఒక్కరే వారసుడు ఉండాలి. ఆ చనిపోయిన వారికి డెత్ సర్టిఫికెట్ ఉండాలి వాళ్లు చనిపోయిన వారి వారసులే అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఉండాలి. తాత ముత్తాతల డెత్ సర్టిఫికెట్స్ చాలా మంది తీసుకుని ఉండరు, ఎప్పుడో చనిపోయిన వాళ్ల డెత్ సర్టిఫికెట్స్ కావాలంటే నేరుగా గ్రామపంచాయతీ నుంచి తీసుకోరాదని ఆర్డీవో ప్రొసీడింగ్ ఉండాలి. చాలా జిల్లాల్లో ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడంలేదు. ఒకవేళ డెత్ సర్టిఫికెట్ ఉన్నా కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను చనిపోయిన వారి బ్యాక్ ఖాతాలో డబ్బులు ఉంటే వాటి పర్పస్ కోసమే ఇస్తున్నారు. ఈ రెండు లేకుండా ఆ ఇంటి మార్పిడి సాధ్యం కాదు కాబట్టి ఇది ప్రధాన సమస్యగా ఉంది.
భూ పంచాయితీలు
చనిపోయిన తాత ముత్తాతల పేర్లపై లేదా చనిపోయిన తల్లిదండ్రుల పేరు మీద భూమి ఉంటే వారికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారనుకుందాం. వీళ్లు వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయి ఉంటారు. ఒకరి ఆర్థిక పరిస్థితి సరిగాలేక ఊర్లో ఉన్న స్థలం నివాసం ఉంటున్నారు అనుకుందాం. సాధారణంగా ఈ ఇంటి స్థలంపై పంచాయితీలు ఉంటాయి. ఇప్పుడు గృహలక్ష్మి పథకం వచ్చింది కాబట్టి ఆ ముగ్గురు వారసులు స్థలం మాదంటే మాదని కొట్లాటలు షురూ అవుతున్నాయి. తాత ముత్తాతలకు గ్రామ కంఠం భూముల్లో ఒక ఐదు గుంటలు ఉంటే అందులో రెండు గుంటల్లో ఇళ్లు కడతారు, ఆ రెండు గుంటలు మాత్రమే రికార్డుల్లో వాళ్ల పేర్లు ఉంటాయి, మిగతా మూడు గుంటలు ఎవరి పేరు మీద ఉంటే, వారసత్వంగా ఆ మూడు గుంటల ఖాళీ స్థలాన్ని వారసులు అనుభవిస్తూ వస్తుంటారు. ఎటువంటి రికార్డులు లేని ఆ మూడు గుంటల్లో ఇళ్లు లేని ఆ వారసుల్లో ఒకరు గృహ లక్ష్మి పథకం కింద ఇళ్ళు కట్టాలి అంటే ఎలా?
నిబంధనలు సడలించాలని పోస్టులు
పంచాయతీ, వ్యవసాయేతర భూములు గ్రామాల్లో చాలా మంది ఎప్పుడో సాదా బైనామా కింద కొనుక్కుని రిజిస్ట్రేషన్ లేకుండా గుడిసెలో వేసుకున్నారు. వాటిలో చాలా వరకు గ్రామ పంచాయతీ రికార్డులో వాళ్లు నిర్మించుకున్న రేకుల ఇళ్లు గుడిసెలు కూడా శిథిలమై ఉంటాయి. ఆ నిర్మాణాలు గ్రామ పంచాయతీ రికార్డుల్లో ఉండవు కాబట్టి నిజానికి వారికి కూడా పక్కా గృహాలు అవసరం కానీ గృహలక్ష్మి పథకం ద్వారా వాళ్లు లబ్దిపొందలేని పరిస్థితి నెలకొంది. ఇంకో జనరల్ సమస్య సొంత జాగా ఉండి మూడు లక్షలు పొందాలి అంటే చాలా మంది ఇళ్లు కట్టక ముందే పైసలు ఇస్తారు కావచ్చు పైసలు వచ్చాక ఇంటి పనులు మొదలు పెడదాం అనుకుంటున్నారు. కానీ స్కీమ్ గైడ్ లైన్స్ ప్రకారం మూడు లక్షలు పొందాలంటే ముందు ఎక్కడైనా అప్పు తెచ్చుకుని బెస్మెంట్ కడితే ఆ స్టేజ్ లో లక్ష తరువాత స్లాబ్ పడ్డ స్టేజ్ లో మరో లక్ష ఇళ్లు మొత్తం పూర్తి అయ్యాక ఇంకో లక్ష ఇస్తారని చెప్పారు. ఇన్ని అడ్డంకులు దాటుకుని ఇళ్లు కట్టాలంటే అప్పు తెచ్చుకుని పని మొదలు పెట్టాలి కానీ చాలా మంది ఆర్థిక పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు వెళ్లువెత్తున్నాయి. గృహలక్ష్మి పథకం ద్వారా అసలైన అర్హులు లబ్ది పొందాలంటే నిబంధనలు సడలించాలని కోరుతున్నారు.