TS Gruha Lakshmi : ‘గృహలక్ష్మి’ దరఖాస్తుల్లో గందరగోళం!
Telangana Gruha Lakshmi Scheme: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకానికి సంబంధించిన దరఖాస్తుల విషయంలో గందరగోళంగా మారింది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ… కొన్నిచోట్ల అధికారులకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు.
Telangana Gruha Lakshmi Scheme Applications: సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి స్కీమ్ కోసం తెలంగాణ వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మండల స్థాయిలో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడంతో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. అయితే పలు జిల్లాల్లో అధికారికంగా ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పటికీ... మరికొన్ని జిల్లాల్లో దరఖాస్తుల విషయంపై గందరగోళం నెలకొంది.
దరఖాస్తులపై గందరగోళం...
గృహలక్ష్మి పథకానికి సంబంధించిన పలు దరఖాస్తులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈనెల 10వ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలంటూ పలు జిల్లాల కలెక్టర్లు అధికారికంగా ఆదేశాలు ఇచ్చారు. కానీ పలు జిల్లాల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపిచటం లేదు. ఇక దరఖాస్తు నమూనా పత్రాలు కూడా వేర్వురుగా ఉన్నాయి. సాధారణంగా ఓ పథకం తీసుకొస్తే... దరఖాస్తు నమూనా ఒకేలా ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే... చాలా మండలాల్లో అందుకు భిన్నంగా ఉంది . ఒక్కో చోట ఒక్కో విధంగా దర్శనమిస్తున్నాయి. ఇక ఆగస్టు 10వ తేదీనే లాస్ట్ డేట్ అని చెప్పటంతో స్కీమ్ కోసం ఎదురుచూస్తున్న జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఎంపీడీవో కార్యాలయాల్లో లేదా కలెక్టరేట్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలంటూ వార్తలు వస్తున్నాయి.
ఇదే విషయంపై రంగారెడ్డి జిల్లా మంచాల మండల ఎంపీడీవో శ్రీనివాస్ తో హిందుస్థాన్ టైమ్స్ తెలుగు మాట్లాడింది. దరఖాస్తుల విషయంపై ఇంకా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. పై అధికారుల నుంచి కూడా సమాచారం లేదని వెల్లడించారు. సామాజిక మాధ్యామాల్లో పలురకాల దరఖాస్తులు చక్కర్లు కొడుతున్నాయని...వాటిని నమ్మవద్దని సూచించారు. ఈ స్కీమ్ కు సంబంధించి రేపోమాపో క్లారిటీ రావొచ్చని అన్నారు.
మార్గదర్శకాలు ఇవే….
సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
వంద శాతం రాయితీతో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందించనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారులకు సాయం అందిస్తారు.
రాష్ట్ర రిజర్వు కోటాలో 43 వేల మందికి, మొత్తంగా 4 లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం అందనుంది.
కలెక్టర్లు, కమిషనర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. మహిళల పేరు మీదే ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి.
జన్‌ధన్ ఖాతాను వినియోగించవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రెండు గదులతో ఆర్‌సీసీ ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటి బేస్ మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం సాయం చేస్తుంది.
ఆహార భద్రత కార్డు, సొంత స్థలం ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. ఇప్పటికే ఆర్‌సీసీ ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వులు కింద లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులు.
4 లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి 3 వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తారు.
ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను సెలెక్ట్ చేయాలని మార్గనిర్దేశాల్లో ప్రభుత్వం తెలిపింది. దివ్వాంగులకు కూడా ఐదు శాతం రిజర్వేషన్లను ప్రకటించింది ప్రభుత్వం.