Medak Crime : మహిళా టీచర్‌ను వేధించిన కానిస్టేబుల్.. సస్పెండ్ చేసిన ఎస్పీ.. అసలు వ్యవహారం ఇదీ!-medak sp suspend constable who harassed female teacher ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Crime : మహిళా టీచర్‌ను వేధించిన కానిస్టేబుల్.. సస్పెండ్ చేసిన ఎస్పీ.. అసలు వ్యవహారం ఇదీ!

Medak Crime : మహిళా టీచర్‌ను వేధించిన కానిస్టేబుల్.. సస్పెండ్ చేసిన ఎస్పీ.. అసలు వ్యవహారం ఇదీ!

HT Telugu Desk HT Telugu
Nov 08, 2024 05:54 PM IST

Medak Crime : తన భర్త ఇబ్బంది పెడుతున్నాడని ఓ మహిళా టీచర్ ఠాణాకు వెళ్లింది. అదే అవకాశంగా తీసుకున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ వేధించాడు. ఆ వేధింపులు తీవ్రం కావటంతో.. కానిస్టేబుల్‌పై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్‌ను మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సస్పెండ్ చేశారు.

కానిస్టేబుల్ రాము
కానిస్టేబుల్ రాము

బాధితురాలు ఫిర్యాదు ప్రకారం.. 2013 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రాము ప్రస్తుతం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతను గత సంవత్సరం నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. ఆ సమయంలో మెదక్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఓ విషయంలో గొడవపడ్డారు. ఆమె నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో భర్తపై పిర్యాదు చేయటానికి వచ్చింది. ఈ క్రమంలో నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రాము కేసు విషయంలో కావాలని ఆ మహిళా టీచర్ ఫోన్ నంబర్ తీసుకున్నారు.

మహిళ ఇంటికి వెళ్లి అసభ్యంగా..

అప్పటి నుండి ఆమెకు తరచూ ఫోన్ చేసి కానిస్టేబుల్ వేధించాడు. విసిగిపోయిన టీచర్, అతని నంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయాన్నీ తెలుసుకున్న ఆ టీచర్ భర్త రమేష్.. కానిస్టేబుల్ రామును కలిసి సమస్య తీరిపోయింది, ఇప్పుడు తాము సంతోషంగా ఉన్నామని, ఇప్పటి నుండి తన భార్యకు ఫోన్ చేయొద్దని స్పష్టం చేశాడు. కోపోద్రిక్తుడైన కానిస్టేబుల్ ఈ నెల (నవంబర్ ) 4న రాత్రి ఆ మహిళా టీచర్ ఇంటికి వెళ్లాడు. అసభ్యంగా మాట్లాడుతూ, దుర్భాషలాడాడు. అదే సమయంలో ఆమె కొడుకు రావడంతో గోడ దూకి పారిపోయాడు.

గతంలోనూ..

తనను వేధించాడంటూ ఆ మహిళా టీచర్ నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పై పిర్యాదు చేసింది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారులు కేసును విచారించగా మహిళను వేధించిన విషయం వాస్తవమని తేలింది. దీంతో కానిస్టేబుల్ రామును సస్పెండ్ చేస్తూ మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సమయంలో, ఒక బైక్ దొంగతనం కేసులో బాధితుని నుండి రూ. 15 వేలు లంచం తీసుకున్నాడు. ఆ కేసులో సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు ఈ కేసులో రెండోసారి సస్పెండ్ అయ్యాడు.

కోతి అడ్డురావడంతో..

సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలోని వేచరేణి గ్రామానికి చెందిన పర్పటకం ధర్మారెడ్డి (48) చుంచనకోట ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాద్యాయుడిగా పనిచేస్తున్నారు. రోజువారీ విధి నిర్వహణలో భాగంగా గురువారం ఇంటి నుండి చుంచనకోటకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో బండ్లపల్లి క్రాస్ రోడ్ వద్దకు రాగానే బండికి కోతుల గుంపు అడ్డు వచ్చింది. వాటిని తప్పించుకొని వెళ్తున్న క్రమంలో మరో కోతి బైక్‌కు అడ్డొచ్చింది. అదుపుతప్పి ఉపాధ్యాయుడు కిందపడిపోయాడు.

ఈ ఘటనలో ధర్మారెడ్డి తలకు, ముఖానికి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులకు తెలిపారు.

మరో ఘటనలో ప్రిన్సిపాల్..

విధులు ముగించుకొని ప్రిన్సిపాల్ కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు అదుపుతప్పి కళాశాల ఆవరణలోని చెట్టుకు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు. ఈ ఘనత సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన అర్చన (36) మునిపల్లి మండలం బుదేరా సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

కళాశాలకు వచ్చి విధులు ముగించుకొని సాయంత్రం ఇంటికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో కళాశాల ఆవరణలోని చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కళాశాల సిబ్బంది సదాశివపేట ఆసుపత్రికి తరలించారు. ప్రిన్సిపాల్ అర్చన పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. మృతురాలి భర్త ప్రవీణ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Whats_app_banner