AP Police Recruitment 2024 : ఏపీలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ - రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక ప్రకటన-andhra pradesh state level police recruitment board key announcement on recruitment process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Police Recruitment 2024 : ఏపీలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ - రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక ప్రకటన

AP Police Recruitment 2024 : ఏపీలో కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ - రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 01, 2024 10:15 PM IST

AP Police Recruitment 2024 : ఏపీలోనిలిచిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియపై రిక్రూట్ మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్టులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. స్టేజ్ - 2 దరఖాస్తుల స్వీకరణ తేదీలను కూడా ప్రకటించింది.

ఏపీ పోలీస్ ఉద్యోగాల భర్తీ - కీలక ప్రకటన
ఏపీ పోలీస్ ఉద్యోగాల భర్తీ - కీలక ప్రకటన

రాష్ట్రంలో నిలిచిపోయిన పోలీస్ కానిస్టేబుల్ నియామ‌కాల‌కు క‌స‌ర‌త్తు ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (APSLRB) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది డిసెంబరు చివరి వారంలో ఫిజికల్‌ టెస్టులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదలైంది.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం 2022 న‌వంబ‌ర్ 28న పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చింది. అయితే దీనిపై కోర్టులో కేసులు నమోదయ్యాయి. అయిన‌ప్ప‌టికీ ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హించారు. అలాగే ఫ‌లితాలు కూడా విడుద‌ల అయ్యాయి. ఆ త‌రువాత నిర్వ‌హించాల్సిన మెయిన్స్ రాత ప‌రీక్ష జ‌ర‌గ‌లేదు. ఈలోపు రాష్ట్రంలో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. అంతే వాటికి అతీలేదు, గ‌తీలేకుండా పోయింది.

పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ప్రిలిమ్స్ ప‌రీక్ష 2023 జ‌న‌వ‌రి 22న జ‌రిగింది. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు రాష్ట్ర వ్యాప్తంగా 4,58,219 మంది హాజ‌రయ్యారు. ఫిబ్ర‌వ‌రి 5న ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. మొత్తం 95,208 మంది అభ్య‌ర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి దేహ‌దారుఢ్య‌, శారీర‌క సామ‌ర్థ్య (పీఎంటీ, పీఈటీ) ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంది.

అయితే 2023 మార్చి 13 నుంచి 20 వ‌ర‌కు దేహ‌దారుఢ్య‌, శారీర‌క సామ‌ర్థ్య (పీఎంటీ, పీఈటీ) ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని షెడ్యూల్ విడుద‌ల చేశారు. దీనికి సంబంధించి హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. అయితే స‌రిగ్గా అప్పుడే రాష్ట్రంలో గ్రాడ్యూట్ (ప‌ట్ట‌భ‌ద్రుల‌) ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌లు వ‌చ్చాయి. దీంతో ఆ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది. అయితే అప్ప‌టి నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్య‌ర్థులు ఎదురు చూస్తునే ఉన్నారు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా… పోలీస్ శాఖలో నియామకాలను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలోనే ఈ నియాకాలను పూర్తి చేస్తామని తాజాగా ప్రకటన విడుదల చేసింది.

91,507 మంది అభ్యర్ధులు మాత్రమే ఫిజికల్ టెస్ట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకునేందుకు రిక్రూట్ మెంట్ బోర్డు మరో అవకాశం కల్పించింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 11వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 21 సాయంత్రం 5 గంటలతో ఈ గడువు పూర్తి కానుంది. https://slprb.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి స్టేజ్ 2 అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం