Kakatiya University Lands : కేయూ భూఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్, ఫిజికల్ సర్వే చేస్తున్న అధికారులు
Kakatiya University Lands : కాకతీయ యూనివర్సిటీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు రెండు రోజులుగా వర్సిటీ చుట్టూ ఉన్న ఆక్రమణలను తేల్చేందుకు సర్వే చేస్తుంది. ముఖ్యంగా సర్వే నెంబర్ 229 భూములలో సర్వే చేసి సరిహద్దు గుర్తించింది. ఇక్కడ ఆక్రమణలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థారించింది.
Kakatiya University Lands : కాకతీయ యూనివర్సిటీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు రెండు రోజులుగా యూనివర్సిటీ చుట్టూ ఉన్న కబ్జాలు తేల్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్, కాకతీయ యూనివర్సిటీ డెవలప్ మెంట్ ఆఫీసర్స్ తో కలిసి విజిలెన్స్ అధికారులు జాయింట్ ఇన్ స్పెక్షన్ చేస్తున్నారు. ప్రధానంగా ఎప్పటి నుంచో ఆరోపణలున్న సర్వే నెంబర్ 229 భూములపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బుధవారం ఆ సర్వే నెంబర్ చుట్టూ పక్కల ఉన్న బౌండరీలను గుర్తించారు. ఆ భూమిలో ఆక్రమణలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
రూ.కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతం
కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటు సమయంలో కుమార్ పల్లి, లష్కర్ సింగారం, పలివేల్పుల గ్రామాల పరిధిలోని 673.12 ఎకరాల భూమిని సేకరించారు. కానీ కేయూ క్యాంపస్ చుట్టూ సరైన విధంగా రక్షణ లేని కారణంగా ఆక్రమణలు వెలిశాయి. ముఖ్యంగా కుమార్ పల్లి శివారులోని 229 సర్వే నెంబర్, పలివేల్పుల శివారు 412, 413, 414, లష్కర్ సింగారం శివారు 34 సర్వే నెంబర్ లో కూడా కబ్జాలు జరిగాయనే ఆరోపణలున్నాయి.
ఇదిలా ఉంటే కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్ బాబుతో పాటు మరికొంతమంది కుమార్ పల్లి శివారు 229 సర్వే నెంబర్ లోనే ఇళ్లు కట్టుకుని ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. దీంతోనే గతంలో వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టారు. రూ.కోట్లు విలువైన యూనివర్సిటీ భూములను అధికారులే నొక్కేస్తున్నారంటూ నిరసనలు కూడా కొనసాగించారు. ఆ తరువాత అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) అధ్యక్ష, కార్యదర్శులు ప్రొ.శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ మామిడాల ఇస్తారి ఆధ్వర్యంలో ఇదివరకు వీసీతో పాటు ప్రజాప్రతినిధులకు విన్నవించారు. గత ప్రభుత్వ పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తరువాత మరోసారి ఇన్ఛార్జ్ వీసీ వాకాటి కరుణతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీకి కూడా ఫిర్యాదు చేశారు.
రెండు రోజులుగా జాయింట్ సర్వే
అకుట్ ఫిర్యాదుతో పాటు కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ వాకాటి కరుణ విజ్ఞప్తి మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కాకతీయ యూనివర్సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. విజిలెన్స్ సీఐలు రాకేష్, అనిల్ ఆధ్వర్యంలో గత నెల 31వ తేదీన మొదటి దఫా జాయింట్ ఇన్ స్పెక్షన్ నిర్వహించారు. కేయూ అధికారులతో పాటు మున్సిపల్, రెవెన్యూ, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ తదితర శాఖల అధికారులతో కలిసి సర్వే చేపట్టారు.
ఇదిలాఉంటే వర్సిటీ భూముల్లో ప్రధానంగా కుమార్ పల్లి శివారు సర్వే నెంబర్ 229 లో కేయూ అధికారి అయిన అశోక్ బాబు ఇల్లు ఉండటంతో ఆఫీసర్లు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా ఇదే సర్వే నెంబర్ పై ఆరోపణలు ఎక్కువగా ఉండటంతో రెండు రోజులుగా అదే ల్యాండ్ లో అధికారులు సర్వే జరుపుతున్నారు. మంగళవారం సర్వే నెంబర్ 229 భూమిని పరిశీలించిన విజిలెన్స్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, కేయూ, మున్సిపల్ అధికారులు.. బుధవారం డీమార్కేషన్ చేపట్టారు. ఈ మేరకు సర్వే నెంబర్ 229లో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
యజమానుల్లో గందరగోళం
ఆఫీసర్లు కబ్జాగా గుర్తించిన సర్వే నెంబర్ 229లో చాలా వరకు ఇళ్లు వెలిశాయి. కాగా బుధవారం జాయింట్ ఇన్ స్పెక్షన్ టీమ్ అధికారులు హద్దులు గుర్తించి మార్కింగ్ వేయడంతో అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్న వారిలో గందరగోళం మొదలైంది. ఇదిలాఉంటే ఓ వైపు సర్వే జరుగుతుండగా.. మరోవైపు కబ్జా ఆరోపణలున్న ఇళ్ల యజమానులకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు నోటీసులు కూడా జారీ చేశారు.
మంగళవారం వరకు దాదాపు 76 మందికి నోటీసులు అందజేశారు. దీంతో అందులో కొంతమంది కోర్టుకు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలాఉంటే ఇప్పుడిప్పుడే కాకతీయ యూనివర్సిటీ భూముల ఆక్రమణల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుండటంతో భూఆక్రమణ దారుల్లో కలవరం మొదలైంది. కాగా కాకతీయ యూనివర్సిటీ చుట్టూ సమగ్ర భూసర్వే నిర్వహించి, అన్యాక్రాంతమైన భూములను కబ్జా చెర నుంచి విడిపించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని వర్సిటీ విద్యార్థి సంఘాల నేతలతో పాటు అకుట్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం