BRS Party : పూర్తిగా తిరస్కరించలేదు.. అలా చేసి ఉంటే మనమే గెలిచే వాళ్లం - కేటీఆర్-ktr made key comments on the defeat in the assembly elections 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Party : పూర్తిగా తిరస్కరించలేదు.. అలా చేసి ఉంటే మనమే గెలిచే వాళ్లం - కేటీఆర్

BRS Party : పూర్తిగా తిరస్కరించలేదు.. అలా చేసి ఉంటే మనమే గెలిచే వాళ్లం - కేటీఆర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 11, 2024 02:00 PM IST

BRS Party Latest News : కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మనమే గెలిచే వాళ్లమని కామెంట్స్ చేశారు. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదన్నారు.

కేటీఆర్
కేటీఆర్

KTR Latest News: మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలు బీఆర్ఎస్ కు పదేళ్లు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అనుకోలేదని… నోటికి ఏది వస్తే అది హామి అని చెప్పారని అన్నారు. ఆరు గ్యారెంటీలు అన్నారు… కానీ 420 హమీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పారు. వాళ్ళ తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారని వ్యాఖ్యానించారు.

yearly horoscope entry point

“రేషన్ కార్డులు ఇవ్వలేదు అని ప్రచారం చేశారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అన్నారు, తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చింది. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మన ప్రభుత్వం. మేము ఏనాడు చెప్పుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చింది మన ప్రభుత్వం కానీ మేము చెప్పుకోలేదు, ప్రచారం చేస్కోలేదు. దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్. 29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచినా ఏనాడు చెప్పుకోలేదు. దేశంలో అందరికన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కానీ ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడం విఫలమయ్యాం. అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మేమే గెలిచే వాళ్ళం. వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ హయాంలో అమలు చేసినా, ఏనాడు కూడా ప్రజలను లైన్లలో నిలబెట్టలేదు. ప్రజల సౌకర్యమే చూసాము కానీ రాజకీయ ప్రయోజనము, రాజకీయ ప్రచారమే గురించి ఏనాడు ఆలోచించలేదు. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదని గుర్తుంచుకోవాలి. BRS పార్టీకి మూడో వంతు సీట్లు 39 వచ్చాయి. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్ల తోనే జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ మనకు తేడా కేవలం 1.85 శాతం. స్దానిక సంస్ధల నుంచి మెదలుకోని, అసెంబ్లీదాకా బలమైన నాయకత్వం మనకున్నది. బలమైన ప్రతిపక్షం మనది. అన్నిటికీ మించి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు మనకున్నారు. మహబూబ్ బాద్ పార్లమెంట్ ఎన్నికలే మన గెలుపుకు సోపానం కావాలి” అని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

నాటకాలు ఆడుతున్నారు - కేటీఆర్

“ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి అనేక మాటలు మాట్లాడారు, రుణం ఉన్నవాళ్లే కాదు, వ్యవసాయ రుణం లేనివాళ్లు కూడా తీసుకోండి, రాగానే వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు. ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులు, శ్వేతపత్రాల నాటకాలను ఆడుతున్నారు. అందుకే వాస్తవాలు అందరికీ తెలియాలనే స్వేద పత్రం రూపొందించాం. ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు... మన పార్టీకి బలమైన నాయకులు అద్భుతమైన నాయకత్వం ఉన్నది. ఇలాంటి పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుంటాం... అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం.. పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతాం. గిరిజనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్ తో పాటు.. పొడు భూముల పట్టాల పంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలు అనేక కార్యక్రమాలను మన ప్రభుత్వం గతంలో అందించింది. అయినా గిరిజనం ఎక్కువ ఉన్న చోట్లకూడా ప్రజలు పూర్తి మద్దతు మనకివ్వలేదు, ఇలాంటి వాటన్నింటి విమర్శ చేసుకుని ముందుకుపోతాం” అని కేటీఆర్ చెప్పారు.

Whats_app_banner

సంబంధిత కథనం