Rahul Gandhi : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ- రాహుల్ గాంధీ
Rahul Gandhi : ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ విద్యార్థుల భవిష్యత్తును పక్కన పెట్టి కుటుంబ భవిష్యత్తును చూసుకున్నారని విమర్శించారు.
Rahul Gandhi : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని డిసెంబర్ 9న దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణ వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మట్లాడుతూ... బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ సర్కారు ప్రజల కలలను నాశనం చేసిందని, విద్యార్థుల భవిష్యత్తును పక్కనపెట్టి కుటుంబ భవిష్యత్తును చూసుకుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా,గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్య వికాసం, ఆరు గ్యారెంటీలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి డబ్బులను బయటకు తీసి ప్రజలకు పంచుతామన్నారు, నరేంద్ర మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతిలో ఇద్దరూ భాగస్వాములనే అన్నారు. మోదీ ప్రభుత్వం తన ఎంపీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిందని, నా ఇంటిని కూడా ఖాళీ చేసేందుకు పూనుకుందని మండిపడ్డారు. దేశ సంపదను ప్రధాని మోదీ తన స్నేహితులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చాక రెండు లక్షల కొలువులు
ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పేదలకు హామీ ప్రకారం ఇల్లు కట్టించలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో, మిషన్ భగీరథలో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. రైతుల భూముల దోపిడీకి పాల్పడ్డారని, దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం తెలంగాణలో ఉందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని.. ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ 24 గంటల్లోపు చేస్తామన్నారు.
రిపోర్టింగ్ : వేణుగోపాల కామాజి, ఉమ్మడి ఆదిలాబాద్