Komatireddy Comments : తెలంగాణ ఎలా వచ్చిందో తెలుసా? కేటీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్-komatireddy venkata reddy serious comments on minister ktr
Telugu News  /  Telangana  /  Komatireddy Venkata Reddy Serious Comments On Minister Ktr
కేటీఆర్ పై కోమటిరెడ్డి కామెంట్స్
కేటీఆర్ పై కోమటిరెడ్డి కామెంట్స్

Komatireddy Comments : తెలంగాణ ఎలా వచ్చిందో తెలుసా? కేటీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్

11 October 2022, 18:45 ISTHT Telugu Desk
11 October 2022, 18:45 IST

Komatireddy Comments On KTR : మంత్రి కేటీఆర్ కామెంట్స్ పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. భాష జాగ్రత్త ఉండాలని హెచ్చరించారు. నిజాయితీతో నిప్పులా బతికానని పేర్కొన్నారు.

నిజాయితీతో నిప్పులా బతికానని.. నీ కుటుంబంలా కమీషన్లతో కాదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసలు కోవర్ట్ అనే పదం వాడటానికి నీకున్న అర్హత ఏంటి..? అని ప్రశ్నించారు. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అనటానికి నీకున్న స్థాయి ఏంటి? అడిగారు. అప్పనంగా అధికారం అనుభవిస్తూ.. కోట్ల అవినీతి చేయటం కాదు రాజకీయమంటే? అని వ్యాఖ్యానించారు.

కోమటిరెడ్డి ఏమన్నారంటే..

అమరుల ఆత్మలు ఘోషిస్తుంటే.. విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేయటం అసలే కాదు. ఏ ఒక్క అమరుడి ఇంటికైనా.. ఒక్కసారైనా వెళితే తెలిసేది నీకు నాయకుడంటే ఎలా ఉండాలో? అసలు తెలంగాణ కోసం నువ్వేం చేశావని.. నన్ను కోవర్ట్ అని అంటావ్ కేటీఆర్? నీ భాష ఏంటి? నీ పద్ధతేంటి? ఇంతకీ నువ్వు చదివింది అమెరికాలోనా..! గుంటూరు గల్లీల్లోనా..? అసలు నీకు తెలంగాణ ఎలా వచ్చిందో తెలుసా? ఎవరెవరు ప్రాణత్యాగానికి సిద్ధపడితే.. ఎందరు ప్రాణత్యాగం చేస్తే వచ్చిందో తెలుసా నీకు?

అసలు తెలంగాణ సాధన కోసం మొట్టమొదట ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్న నాయకుడు ఎవరో తెలుసా?తెలీకుంటే.. తెలంగాణలో చిన్నపిల్లవాడినైనా అడుగు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్తాడు. నేను ఉద్యమం చేసే రోజుల్లో నువ్వు నిక్కర్లో ఆడుకుంటున్నావేమో.. మంత్రిగా ఉన్నతమైన హోదాను గడ్డిపోచలా వదులుకుంటే.. నేను చేపట్టిన ఉద్యమం ఉప్పెనై రగిలితే.. తెలంగాణ వచ్చిందనే విషయం తెలీకుంటే అడిగి తెలుసుకో. నా ఆమరణ దీక్ష భగ్నంతో రగిలిన జనం.. నేషనల్ హైవేలను దిగ్బంధిస్తే కానీ దిల్లీ తలవంచలేదనే విషయం.. ఫాంహౌజ్ ల్లో ఎంజాయ్ చేసే నీకెలా తెలుస్తుంది కేటీఆర్?

సాగరహారంలో నన్ను తాకిన రబ్బరు బుల్లెట్లను అడుగు.. ఆనాడు నా వెంట నడిచిన లక్షలాది జనాన్ని అడుగు.. ఈ రాష్ట్రంలో ఎవరు ప్రజా నాయకులో ఎవరు కోట్లు వెనకేసుకున్న కోవర్టులో..? దిల్లీ లిక్కర్ స్కాంలో కోడై కూస్తున్న నేషనల్ మీడియాను అడుగు కేటీఆర్.. కోవర్టులు ఎవరో..? నమ్మి నెత్తిన పెట్టుకున్న తెలంగాణ జనాన్ని నిండా ముంచి.. దిల్లీతో సెటిల్మెంట్లు చేసుకుని ఎంజాయ్ చేస్తున్న కోవర్టులు ఎవరు? ప్రతిరోజూ ఈడీ రెయిడ్స్, ఐటీ రెయిడ్స్ ఎవరి అనుచరుల కంపెనీల మీద జరుగుతున్నాయో.. ఎవరు అరెస్ట్ అవుతున్నారో..? రోజూ న్యూస్ చూసే ఎవరినైనా అడుగు!

అయినా.. నీ మీద ఈగవాలదు.. ఎందుకని కేటీఆర్..? ఇవి చాలదా కోవర్టులెవరో తెలియటానికి..? ఎక్కడ ఎవరికి పేరొస్తుందో అని.. నల్గొండ జనానికి తాగునీరు రాకుండా చేసింది ఎవరో అందరికీ తెలుసు..! అంతెందుకు.. మీ నాయిననడుగు..? మీ నాయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఫ్లోరైడ్ సమస్య మీద 13 రోజులు నిరాహార దీక్ష చేసిన! గత నలభై యేళ్లుగా ఫ్లోరైడ్ సమస్య మీద.. ఏ నాయకుడూ చేయని పోరాటం చేసిన.. ఆ సంగతి ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలనడుగు!

నల్గొండ ఫ్లోరోసిస్ బాధితులకి అండగా నిలబడ్డది నేనైతే.. వాళ్లకు తాగునీళ్లు లేకుండా చేస్తున్నది మీరేనని కూడా జనానికి బాగా తెలుసు..! మరి నీ వైపు ఇన్ని తప్పులు పెట్టుకుని.. తెలంగాణ ఉద్యమ సారథిని.. ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డ నన్ను కోవర్ట్ అనటానికి నీకు సిగ్గుగా లేదా కేటీఆర్? అసలు నా మీద బురదజల్లే నీకు.. ఇంత వైభోగమెలా వచ్చింది? పట్టుమని పదెకరాలు లేని నీకు వేలకోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో.. నువ్వు ఒట్టేసి చెప్పగలవా..? ఆ దమ్ముందా..? నువ్వు దిల్లీకి కోవర్టువు కాదని.. ఒట్టేసి చెప్పే దమ్ము నీకుందా..? కేటీఆర్..? నీ అవినీతికి..స్కాంలకి..! నువ్వు కోవర్టువి కాకుంటే ఈ పాటికే జైల్లో ఉండేవాడివనే సంగతి నేను ప్రత్యేకంగా చెప్పాల్నా?

ఒక్కమాటలో చెప్పాలంటే..! కాళేశ్వరంతో పాటు ప్రతి ప్రాజెక్ట్ లోనూ కమిషన్లు బొక్కే కల్వకుంట్ల ఫ్యామిలీ నీది. ఇంకా చెప్పాలంటే... కోమటిరెడ్డి అంటే నిజాయితీకి మారుపేరు. కల్వకుంట్ల అంటే కమీషన్లకు మారుపేరు. కాదని చెప్పే దమ్ముందా నీకు కేటీఆర్? దమ్ముంటే రా మరి..! యాదగిరి గుట్ట.. భాగ్యలక్ష్మి ఆలయం.. ఇంకా వరంగల్ భద్రకాళి.. బాసర సరస్వతి మాత.. ఇలా ఎక్కడికైనా నేను రెడీ..! ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడికి నేను రెడీ.. మరి నువ్వు రెడీనా..?