TRS KTR : బిఆర్‌ఎస్ తెలంగాణ సారథిగా కేటీఆర్…?
TRS KTR కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుతో రాష్ట్ర పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతికి వస్తాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి ముహుర్తం ఖరారు కావడంతో రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించేంత సమయం ఉండకపోవచ్చనే ఆలోచనతో రాష్ట్ర పార్టీ పగ్గాలు కేటీఆర్‌కు చేతికి దక్కొచ్చని పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.
TRS KTR తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా మార్చేందుకు ముహుర్తం ఖరారైంది. విజయదశమి తర్వాత అక్టోబర్ 6న జాతీయ పార్టీ ఏర్పాటుకు ఈసీకి దరఖాస్తు చేయనున్నారు. కేసీఆర్ ఆలోచనలతో పురుడు పోసుకుంటోన్న జాతీయ పార్టీ పేరు మార్పిడి ప్రక్రియ విజయదశమి రోజు, ఈ నెల 5న ప్రారంభమవుతుంది.
విజయదశమి రోజు తెరాస విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ నిర్ణయం ఆమోదం పొందిన మర్నాడు అక్టోబర్ ఆరున ఢిల్లీకి ప్రతినిధుల బృందం వెళ్తుంది. టిఆర్‌ఎస్ (TRS ) పేరును జాతీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేస్తారు. టిఆర్‌ఎస్ దరఖాస్తును ఆమోదిస్తే వెంటనే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో మార్పులు జరుగుతాయి.
కొత్తగా ఏర్పాటయ్యే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ KCR ఉంటారు. తెలంగాణ విభాగానికి అధ్యక్షుడిగా ప్రస్తుత తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను నియమించే అవకాశం ఉంది. జాతీయ పార్టీగా పేరుకు ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నోటిఫికేషన్ జారీ చేస్తుంది. దాన్ని ఆధారంగా పార్లమెంటులో, శాసనసభలో, మండలిలో పార్టీ పేరు మారుతుంది.పార్టీ పేరు మార్పుపై ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సజావుగా సాగితే కొత్త పార్టీ దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు సాగించేందుకు వీలు కలుగుతుంది.
మరోవైపు పార్టీ పేరు బిఆర్‌ఎస్‌గా (BRS ) మారిన తర్వాత కూడా శాసనసభలో పార్టీ పక్ష నేతగా కేసీఆర్ కొనసాగుతారు. జాతీయ పార్టీ తరపున మొదట సమన్వయకర్తలను నియమించి ఆ తర్వాత రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తారు. దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలతో పాటు సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలను వివిధ దశల్లో చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు కరీంనగర్‌లలో కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన భారీ బహిరంగ సభలను నిర్వహిస్తారు. డిసెంబర్ 9న ఢిల్లీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు.
దసరా రోజున ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) తెరాస విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్‌లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం సహా మొత్తం 283 మంది హాజరయ్యే సమావేశంలో పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ ప్రకటిస్తారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ‌్ళే క్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ పార్టీ పేరును మార్చబోతున్నారు. టీఆర్‌ఎస్‌గా ఉన్న పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ విస్తృత స్థాయి సమావేశం తీర్మానం చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు జాతీయ పార్టీ ప్రకటన చేయాలని నిర్ణయించారు.