Munugodu bypoll : మునుగోడు ప్రచారంలోకి ఎంపీ కోమటిరెడ్డి ఎంట్రీ ఎప్పుడు..?-hot topic on congress mp komatireddy venkatreddy over no campaign for munugodu yet ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hot Topic On Congress Mp Komatireddy Venkatreddy Over No Campaign For Munugodu Yet

Munugodu bypoll : మునుగోడు ప్రచారంలోకి ఎంపీ కోమటిరెడ్డి ఎంట్రీ ఎప్పుడు..?

HT Telugu Desk HT Telugu
Oct 08, 2022 03:13 PM IST

congress mp komatireddy venkatreddy: మునుగోడుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. సిట్టింగ్ స్థానం కావటం కాదు చావోరేవోగా మారిపోయింది. అయితే ఈ బైపోల్ విషయంలో వ్యూహన్ని మార్చి ముందుకెళ్తోంది. అంతాబాగానే ఉన్న ఆ ఎంపీ ప్రచారానికి రాకపోవటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫొటో)
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫొటో)

congress campaign for munugodu bypoll: పాల్వాయి స్రవంతి, చలిమల కృష్ణారెడ్డి, పల్లె రవి కుమార్ గౌడ్, కైలాష్ నేత... ఈ పేర్ల చుట్టే మునుగోడు కాంగ్రెస్ రాజకీయం నడిచింది. వీరిలో ఎవరికి టికెట్ అనే దానిపై తెగ చర్చలు చేసింది. ఫైనల్ గా పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. అంతేనా ఓ కార్యాచరణను కూడా ప్రకటించింది. ఈనెల 18 నుంచి నేతలంతా మునుగోడులోనే ఉంటున్నారు. ప్రతి గామాన్నీ చుట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు చర్చ అంతా లోకల్ ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి చుట్టే నడుస్తోంది. ఈ క్రమంలో ఆయన ప్రచారంలో పాల్గొంటారా..? ఎప్పట్నుంచి ప్రచారానికి వస్తారు..? అసలు ప్రచారానికి వచ్చే ఉద్దేశ్యమే లేదా వంటి అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటివరకు రాలేదు !

ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత ఉప ఎన్నికల(దుబ్బాక, హుజురాబాద్) ఓటమిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారం షురూ చేసింది. ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు ఇంచార్జ్ లను నియమించింది. గత నెల 18వ తేదీ నుంచి నేతలంతా స్థానికంగా మోహరించేలా ప్లాన్ చేసేసింది. అభ్యర్థి కూడా పాల్వాయి స్రవంతి కూడా....నేతలందర్నీ సమన్వయం చేసుకునేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని స్వయంగా ఇంటికి వెళ్లి కలిశారు. ఎన్నికల ప్రచారానికి రావాలని స్రవంతి కోరగా వస్తానని ఎంపీ కోమటి రెడ్డి మాటిచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిణామం కూడా పార్టీ శ్రేణులకు బూస్ట్ ఇచ్చేలా మారిందనే టాక్ వినిపించింది. అయితే ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి మాత్రం మునుగోడు వైపు కన్నెత్తి చూడటం లేదు కదా... కనీసం ఓ మాట కూడా మాట్లాడటం లేదు. లోకల్ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి ఎందుకు రావటం లేదన్న చర్చ జోరుగా నడుస్తోంది.

కారణాలు ఇవేనా..?

రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశం తెరపైకి వచ్చిన నాటి నుంచి చర్చ అంతా ఎంపీ కోమటిరెడ్డి చుట్టు నడిచింది. ఆయన కూడా బీజేపీలోకి వెళ్తారనే టాక్ ఓ రేంజ్ లో వినిపించింది. ఇక చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ సభలో... ఆయనపై సొంత పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామాలపై ఎంపీ కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రేవంత్ రెడ్డి చేసిన హోంగార్డు వ్యాఖ్యలను కూడా వెంకటర్ రెడ్డి సీరియస్ గా తీసుకోవటం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. ఇదిలా ఉండగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నియమాకాలపై కూడా కోమటిరెడ్డి గుర్రుగా ఉన్నారనే చర్చ నడిచింది. కనీసం ఆయనకు తెలియకుండానే ఎన్నికల కమిటీని కూడా ప్రకటించారు. ఈ విషయాలను కూడా ఎంపీ కోమటిరెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో ఎక్కువగా కనిపిస్తున్న కోమటిరెడ్డి... హైకమాండ్ పెద్దలతో కూడా భేటీ అయ్యారు. అయితే మునుగోడులో ప్రచారం నిర్వహిస్తారని అంతా భావించినప్పటికి... గ్రౌండ్ లో మాత్రం పరిస్థితి అలా లేదు. కనీసం ఇప్పటివరకు ఒక్క దఫా కూడా కోమటిరెడ్డి మునుగోడులో పర్యటించకపోవటం కేడర్ కు రుచించటం లేదు.

వీటన్నింటి నేపథ్యంలో అసలు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారు..? సొంత పార్టీ అభ్యర్థి స్రవంతికి మద్దతుగా ప్రచారం చేస్తారా..? లేక బీజేపీ నుంచి బరిలో ఉన్న సోదరుడు రాజగోపాల్ రెడ్డి విజయం కోసం పరోక్షంగా పని చేస్తారా అనే దానిపై కూడా నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. మరోవైపు వెంకటరెడ్డి ప్రచారానికి వస్తారని పాల్వాయి స్రవంతి చెబుతునప్పటికీ ఆయన మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, మరోవైపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చూస్తే అసలు ఇంతకీ వెంకటరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఇదే నెలలో రాష్ట్రంలోకి జోడో యాత్ర కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ క్రమంలో వెంకట్ రెడ్డి ఏం చేయబోతున్నారనేది టీ కాంగ్రెస్ లో ఇంట్రెస్టింగ్ మారింది.

WhatsApp channel