BRS Party : ఒక్క సీటు... నలుగురు నేతలు - ఆసక్తి రేపుతున్న 'జహీరాబాద్' రాజకీయం!
TS Assembly Elections : ఈసారి ఎలాగైనా టికెట్ పొందాలి.. అసెంబ్లీలో అడుగుపెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు జహీరాబాద్ బీఆర్ఎస్ లీడర్లు. సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఫిట్టింగ్ పెట్టేలా మరో ముగ్గురు నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్ లోని అంతర్గత కలహాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అధినాయకత్వం సూచనలతో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ... ఎన్నికలకు మరికొద్దిరోజులే టైం ఉండటంతో.... టికెట్ ఆశిస్తున్న నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధినేత ఆశీసులు పొంది... అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెట్టేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అవసరమైతే సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ... విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ఇదే పరిస్థితి చాలా చోట్ల ఉండగా... ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో మాత్రం ఓ సీటు ఆసక్తికరంగా మారింది. ఏకంగా టికెట్ కోసం నలుగురు నుంచి ఐదుగురు నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా.... టికెట్ ఎవరికి దక్కుతుంది..? రాని వారి పరిస్థితేంటి...? పక్క పార్టీలవైపు చూసే అవకాశం ఉందా..? అన్న చర్చ నియోజకవర్గంలో గట్టిగా నడుస్తోంది. మరీ ఆ నియోజకవర్గమేంటి..? అక్కడి కథెంటో చూద్దాం....
జహీరాబాద్.... ఉమ్మడి మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తోంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందువరకు కూడా కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. ఇక్కడ్నుంచి సీనియర్ నాయకురాలు గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ గీతారెడ్డినే గెలిచారు. అయితే ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావ్ విక్టరీ గెట్టారు. దాదాపు 30 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గంలో పరిణామాలు మారిపోయాయి. కాంగ్రెస్ లోని కేడర్... పెద్ద ఎత్తున కారెక్కింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కారు టాప్ గేర్ తో దూసుకెళ్లింది. అయితే మరికొద్ది నెలల్లోనే మరోసారి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.... అధికార బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రధానంగా నలుగురు నేతలు కన్నేశారు. మరోసారి టికెట్ తనదేనంటూ ఎమ్మెల్యే మాణిక్ రావ్ చెబుతుండగా.... ఈసారి అభ్యర్థి మార్పు ఉంటుందని టికెట్లు ఆశిస్తున్న నేతలు తేల్చి చెబుతున్నారు. అధినేత ఆశీసులు ఈసారి తమకే ఉంటాయని.... ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు.
రేసులోని నేతలు వీరే...?
తెలంగాణ మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2018 ఎన్నికల్లోనూ ఈ టికెట్ ను ఆశించారు ఎర్రోళ్ల శ్రీనివాస్. కానీ ఆయనకు దక్కలేదు. అయితే ఈసారి మాత్రం తనకే వస్తుందని గట్టిగా భావిస్తున్నారు. నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు.మంత్రి హరీశ్ రావ్ ప్రధాన అనుచరుడిగా పేరున్న ఎర్రోళ్లకు పార్టీ అధినాయకత్వం వద్ద మంచి గుర్తింపు ఉంది. వీటన్నింటిని తనకు అనుకూలంగా మార్చుకోవటంతో పాటు... నియోజకవర్గంలోని జరుగుతున్న పలు వేడుకలతో పాటు పరామర్శలు వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ వ్యవహారంపై మాణిక్ రావు పార్టీ హై కమాండ్ కు కూడా ఫిర్యాదు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎర్రోళ్ల శ్రీనివాస్ నాన్ లోకల్ కావటం ఇబ్బందికరంగా మారింది. మరోవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తున్న మరో నేత ఢిల్లీ వసంతం చాలా ఆశలు పెట్టుకున్నారు. లోకల్ అభ్యర్థి అయిన ఆయన.... చెరుకు రైతుల సమస్యలపై గతంలో ఢిల్లీ వరకు పాదయాత్ర చేసి తన పేరునే ఢిల్లీ వసంత్ గా మార్చుకున్నారు. ఇయనకు కూడా మంత్రి హరీశ్ అండదండలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఈసారి టికెట్ దక్కించుకునేందుకు సర్వశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
కొత్త చేరిక... సరికొత్త టెన్షన్...
టికెట్ కోసం ముగ్గురు నేతలు ప్రయత్నం చేస్తున్న క్రమంలో.... మరో నేత ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన ఏర్పుల నరోత్తం గులాబీ కండువా కప్పుకున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి నరోత్తం రెండుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ నుంచి టికెట్ వచ్చే అవకాశం లేదని భావించిన ఆయన... కారు ఎక్కెనట్లు తెలుస్తోంది. హరీశ్ రావ్ రాయబారంతో పార్టీలోకి వచ్చిన ఆయన... వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారనే హామీతోనే చేరారనే వార్తలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ అధికారిగా పేరున్న ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరుంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బరిలో ఉన్న ఆయన... దాదాపు 39 వేల ఓట్లను సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన గులాబీ కండువా కప్పుకోవటంతో జహీరాబాద్ రాజకీయం రసవత్తరంగా మారింది.
కర్ణాటక సరిహద్దులో ఉంటుంది జహీరాబాద్ నియోజకవర్గం. పారిశ్రామిక ప్రాంతంగా పేరున్న ఇక్కడ వేర్వురు ప్రాంతాల వారు ఉంటారు. ఎస్సీ రిజర్వ్ డు నియోజకవర్గమైన ఇక్కడ...మొదట్నుంచి కాంగ్రెస్ ఆధిపత్యం ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ స్థానికంగా బలంగా ఉండటంతో.... టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు పలువురు నేతలు. సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఫిట్టింగ్ పెడుతున్న నేతల్లో ఎవరికి టికెట్ రాబోతుందనేది టాక్ ఆఫ్ ది జహీరాబాద్ గా మారింది. ఆశావాహులను కాదని...మరోసారి మాణిక్ రావ్ కే ఛాన్స్ దక్కుతుందా లేక... అభ్యర్థి మార్పు ఖాయమేనా అనేది తేలాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే....!