Jagga Reddy : మెదక్ ఎంపీ సీటుపై జగ్గారెడ్డి గురి...?
Lok Sabha Elections 2024 : తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి… ఎంపీ బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరపున మెదక్ ఎంపీ టికెట్ ను దక్కించుకోవాలని చూస్తున్నారు.
Lok Sabha Elections 2024 : అసెంబ్లీ ఎన్నికల్లో అనుకోని ఓటమి తరువాత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి పార్టీలో తన ప్రాబల్యం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా, ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరుమోసిన జగ్గా రెడ్డి… అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమై తర్వాత, పార్టీ లో తన పాత్ర ఒక ప్రశ్నర్ధాకం అయ్యింది. ఎమ్మెల్యే అయితే, రాష్ట్ర కాబినెట్ లో తప్పకుండా ఉండే పేర్లలో ఒకటి జగ్గా రెడ్డి. అలాంటిది ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇటు జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ తనకు ఎటువంటి పదవి లేకపోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితిల్లో జగ్గా రెడ్డి, మెదక్ ఎంపీ సీటుపైనా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. కనీసం ఎంపీగా నైనా గెలిస్తే… తనకు పార్టీ లో కానీ అధికారుల దగ్గర కానీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి అని అయన అనుచరులు భావిస్తున్నారు.
దామోదర్, రేవంత్ తో విబేధాలు...
తనకు జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ, ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తో కూడా మంచి సంబంధాలు లేకపోవడంతో… జగ్గా రెడ్డికి కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చే అవకాశము చాలా తక్కువే అని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎంపీగా గెలిస్తే… గౌరవం తిరిగి వస్తుందని అయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయినా తరువాత, జగ్గా రెడ్డి మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో తాను మెదక్ ఎంపీ సీటు ఆశించాడు. అయితే పార్టీ నాయకత్వం.. ఆ సీటును మాజీ మంత్రి సునీతా లక్ష్మా రెడ్డికి ఇవ్వటంతో , అయన బీజేపీ పార్టీలోకి వెళ్లి మరీ ఆ ఎన్నికల్లో పోటీచేశాడు. అయితే, బీఆర్ఎస్ గట్టి వేవ్ ఉన్న సమయంలో, కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందాడు. సునీతా లక్ష్మ రెడ్డికి రెండో స్థానంలో నిలవగా, జగ్గా రెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రాష్ట్రంలో ప్రస్తుతం, కాంగ్రెస్ పార్టీ కి అనుకూల వాతావరణం ఉండటంతో, ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి పోయిన గౌరవాన్ని తిరిగి పొందాలని చూస్తున్నాడు జగ్గా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడినుడి పోటీ చేయటానికి చెప్పుకో దగ్గ అభ్యర్థి లేకపోవటంతో, జగ్గా రెడ్డికి సీటు ఇచ్చే అవకాశమున్నదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లలో, అందరికి తెలిసినవాడు కావడం జగ్గారెడ్డి కలిసొస్తుందని తన అనుచరులు భావిస్తున్నారు. అయితే, గత ఐదు ఎన్నికల్లో కూడా మెదక్ ఎంపీ స్థానాన్ని, బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవటం, 2023 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి మెదక్ ఎంపీ పరిధిలోని ఏడూ స్థానాల్లో, ఆరు గెలుపొందటం ఇక్కడ విజయం జగ్గా రెడ్డికి అంత ఈజీ కాదని తేల్చి చెప్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాకుండా, మరొక పార్టీ గెలవటమంటే అంత ఆశామాషి కాదని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.