Jaggareddy : కాంగ్రెస్ నేతలను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవండి, సంగారెడ్డి అధికారులకు జగ్గారెడ్డి అల్టిమేటం!
Jaggareddy : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి.. కాంగ్రెస్ నేతలను అధికార కార్యక్రమాలకు ఆహ్వానించాలని ఆదేశించారు.
Jaggareddy : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి సంగారెడ్డి అధికారులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, సంగారెడ్డి జిల్లా అధికారులు, కలెక్టర్, ఎస్పీ నుంచి జిల్లా అధికారులంతా తన ఆదేశాలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. శనివారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లా అధికారులు మహాలక్ష్మి పథకం కానీ, ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభ కార్యక్రమాలకు తన భార్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా రెడ్డిని పిలవాలని అయన ఆదేశించారు. అదేవిధంగా మండలంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులను కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవాలని ఆయన అన్నారు.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో
తాను కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో ఈ ఆదేశాలు జారీ చేస్తున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిశానని, దురదృష్టవశాత్తు ఈసారి ఆ పదవిలో లేనని అన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంగారెడ్డిలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సంగారెడ్డి జిల్లా అధికారులందరూ మంత్రి హరీష్ రావు ఆదేశాలను పాటిస్తూ మాజీ ఎమ్మెల్యే అయినా చింత ప్రభాకర్ ను అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచారని జగ్గారెడ్డి ఎత్తి చూపారు. అయితే, తాను ఎంతో హుందాగా ఉంటానని, తాను ఎప్పుడు కూడా ఆ విషయం పైన రాద్ధాంతం చేయలేదని అన్నారు. ఈ సారి మాత్రం తన తరపున, తన భార్య అధికార కార్యక్రమాలకు వస్తుందని, అధికారులు ఎవరూ అశ్రద్ధ చేయకుండా నిర్మలను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవాలని కోరారు. తన భార్య ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు హోదాలో ఉన్నారని తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్ లు, నలుగురు మండల ప్రెసిడెంట్ లు, గెలిచినా ఓడినా ప్రతి ప్రజా ప్రతినిధులకు,ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర అన్ని సెల్స్ కి సంబంధించిన నాయకులకు సైతం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నారు.
6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు
ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన్నట్లుగా మహిళలకు ఇవాళ్టి నుంచే ఉచిత బస్ ప్రయాణం మొదలు పెడుతున్నారన్నారు. ఇక నుంచి మహిళలు రాష్ట్రంలో ఎక్కడ బస్ లో ప్రయాణం చేసిన టికెట్ అవసరం లేదని, ఫ్రీ గా వెళ్ళిరావొచ్చన్నారు. అలాగే ఆరోగ్య శ్రీ పథకం పరిమితి 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. మిగతా 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని జగ్గారెడ్డి అన్నారు.
రిపోర్టింగ్ : హెచ్.టి.తెలుగు ప్రతినిధి, సంగారెడ్డి