Hydra Demolish : వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు హైడ్రా ఝలక్.. అక్రమ కట్టడాలు కూల్చివేత.. లిస్టులో మరికొందరు!-hydra demolished the illegal structures belonging to former ycp mla ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra Demolish : వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు హైడ్రా ఝలక్.. అక్రమ కట్టడాలు కూల్చివేత.. లిస్టులో మరికొందరు!

Hydra Demolish : వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు హైడ్రా ఝలక్.. అక్రమ కట్టడాలు కూల్చివేత.. లిస్టులో మరికొందరు!

Basani Shiva Kumar HT Telugu
Sep 08, 2024 03:11 PM IST

Hydra Demolish : హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రముఖులకు చెందిన అక్రమ కట్టడాలను వదలడం లేదు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసింది. దీనిపై అటు ఏపీలోనూ చర్చ జరుగుతోంది.

జగన్‌తో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని
జగన్‌తో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని (@katasaniysrcp)

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పెద్ద చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్), బఫర్ జోన్‌లలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కట్టడాలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించినవి అని చెబుతున్నారు. రాంభూపాల్ రెడ్డి, అతని భాగస్వామి రమేష్ నిర్మించిన కట్టడాలు ఆక్రమం అని ధృవీకరించిన తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ ప్రదేశాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించిన వారం తర్వాత కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి.

కాటసాని ఆక్రమించుకున్నారని..

వివాదాలకు కేంద్రంగా ఉన్న ఈ సరస్సు నీటి వనరుల మధ్య ఉన్న భూమి.. తమదేనని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే ఆక్రమించుకున్నట్లు సమాచారం. స్థానికులు, పర్యావరణ కార్యకర్తల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు అనధికార నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. గతంలో రాంభూపాల్ రెడ్డి సరస్సు పరిసరాల్లో కొండలు, భూములు కొనుగోలు చేశారంటూ వివాదంలో చిక్కుకున్నారు.

ఎన్జీటీలో అఫిడవిట్..

అక్కడి గ్రామస్థుల నుంచి చట్టబద్ధంగా భూమిని సేకరించి.. 45 ఎకరాలకు పైగా అభివృద్ధి ఒప్పందాలు చేసుకున్నట్లు కాటసాని వర్గీయులు వాదించారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో అఫిడవిట్ దాఖలు చేసింది. సరస్సులోని 92 ఎకరాలను షికం వాటర్ బాడీగా, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లోని 170 ఎకరాల పట్టా భూమిని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా ఎన్డీటీ ప్రకటించింది.

స్పందించిన కాటసాని..

ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే స్పందించారు. భూసేకరణలన్నీ చట్టబద్ధమైనవేనని చెప్పారు. తన అభ్యంతరాలను అధికారులకు సమర్పించామని స్పష్టం చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని వివరించారు. తన భూములకు సంబంధించిన లేఅవుట్‌ను 1991లోనే హెచ్‌ఎండీఏ ఆమోదించిందని చెప్పారు. 2015లో కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) జారీ చేశారని కాటసాని వివరించారు.

రంగనాథ్ పర్యటన తర్వాత..

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్ కుంట చెరువును సందర్శించారు అక్కడ జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌ నిర్మాణాలను పరిశీలించారు. స్థానికులను, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్రమంగా నిర్మించారని నిర్ధారణకు వచ్చాక కూల్చివేత నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపైనే మురళీ మోహన్ తాజాగా స్పందించారు.

మురళీ మోహన్ స్పందన ఇదీ..

తాను ఆక్రమణలకు పాల్పడలేదని మురళీ మోహన్ స్పష్టం చేశారు. బఫర్‌జోన్‌లో ఉన్న రేకుల షెడ్డును తానే కూలుస్తానని స్పష్టం చేశారు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని.. ఎలాంటి ఆక్రమణలు చేయలేదని మురళీ మోహన్ వివరించారు. గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్ కుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే మురళీ మోహన్‌పై ఆరోపణలు ఉన్నాయి. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేస్తామని హైడ్రా వార్నింగ్ ఇచ్చింది.