Murali Mohan : నేనే కూలుస్తా.. హైడ్రా నోటీసులపై నటుడు మురళీమోహన్ స్పందన..!-film actor murali mohan responded to the hydra notices ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Murali Mohan : నేనే కూలుస్తా.. హైడ్రా నోటీసులపై నటుడు మురళీమోహన్ స్పందన..!

Murali Mohan : నేనే కూలుస్తా.. హైడ్రా నోటీసులపై నటుడు మురళీమోహన్ స్పందన..!

Basani Shiva Kumar HT Telugu
Sep 08, 2024 12:27 PM IST

Murali Mohan : హైదరాబాద్‌లోని జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చింది. దీనిపై సినీ నటుడు మురళీ మోహన్ స్పందించారు. బఫర్ జోన్‌లో ఉన్న కట్టడాలను తానే కూల్చేస్తానని ప్రకటించారు. అటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

మురళీ మోహన్
మురళీ మోహన్ (HT)

హైడ్రా నోటీసులపై నటుడు మురళీమోహన్ స్పందించారు. తాను ఆక్రమణలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. బఫర్‌జోన్‌లో ఉన్న రేకుల షెడ్డును తానే కూలుస్తానని స్పష్టం చేశారు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని.. ఎలాంటి ఆక్రమణలు చేయలేదని మురళీ మోహన్ స్పష్టం చేశారు. గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్ కుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే మురళీ మోహన్‌పై ఆరోపణలు ఉన్నాయి. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేస్తామని హైడ్రా వార్నింగ్ ఇచ్చింది.

శుక్రవారమే పరిశీలించిన రంగనాథ్..

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్ కుంట చెరువును సందర్శించారు అక్కడ జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌ నిర్మాణాలను పరిశీలించారు. స్థానికులను, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్రమంగా నిర్మించారని నిర్ధారణకు వచ్చాక కూల్చివేత నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపైనే మురళీ మోహన్ తాజాగా స్పందించారు.

భారీ బందోబస్తు మధ్య..

అటు మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్‌లో అక్రమంగా నిర్మించిన విల్లాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఆదివారం ఉదయమే అక్కడికి చేరుకున్న అధికారులు.. యంత్రాల సాయంతో కూల్చివేతలు చేపట్టారు. ఇందులో ఎక్కువగా విల్లాలు ఉన్నాయి. మల్లంపేట్‌ కత్వా చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం ఉదయమే మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ విల్లాల వద్దకు అధికారులు, పోలీసులు చేరుకున్నారు. బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

బాధితుల ఆందోళన..

విల్లాలకు సంబంధించిన యాజమానులు ఆందోళనకు దిగారు. నిబంధనల మేరకే తాము కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. పేపర్లు ఉన్నా ఎలా కూలుస్తారని ప్రశ్నిస్తున్నారు. కోర్టుకు పోవడానికి వీలు లేకుండా వారాంతాల్లో మాత్రమే ఉండేలా హైడ్రా కూల్చివేతలు చేపడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక వ్యవస్థ దిశగా అడుగులు..

మరోవైపు హైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థను కూడా తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. సాధారణ పోలీసులను దీని అవసరాల కోసం వినియోగిస్తే రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని.. ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే జరిగితే.. దేశంలోనే నాలుగో ప్రత్యేక పోలీస్ వ్యవస్థ కానుంది. తెలంగాణలో ఇప్పటికే సైబర్‌ సెక్యూరిటీ, నార్కొటిక్స్‌ విభాగాలకు రెండు ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు.

పరిధి విస్తరించే ఆలోచన..

హైడ్రాను మరింత విస్తరించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి వరకు ఉన్న హైడ్రాను.. హెచ్‌ఎండీఏ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి.. వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు కూడా నేలమట్టం కానున్నాయి.

Whats_app_banner