HYDRA : ఆక్రమణలపై 'హైడ్రా' దూకుడు.. దుండిగల్ పరిధిలో విల్లాల కూల్చివేత-hydra demolishing villas in dundigal municipality ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra : ఆక్రమణలపై 'హైడ్రా' దూకుడు.. దుండిగల్ పరిధిలో విల్లాల కూల్చివేత

HYDRA : ఆక్రమణలపై 'హైడ్రా' దూకుడు.. దుండిగల్ పరిధిలో విల్లాల కూల్చివేత

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 08, 2024 11:54 AM IST

హైదరాబాద్ పరిధిలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఇవాళ మేడ్చల్‌ జిల్లాలోని దుండిగల్‌ మున్సిపాలిటీల పరిధిలో ఆక్రమణలను కూల్చివేస్తోంది. ఇందులో విల్లాలు ఉన్నాయి. మరోవైపు ఇంటి యాజమానులు ఆందోళనకు దిగారు.

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు

మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ లో అక్రమంగా నిర్మించిన విల్లాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇవాళ ఉదయమే అక్కడికి చేరుకున్న అధికారులు… యంత్రాల సాయంతో కూల్చివేతలు చేపట్టారు. ఇందులో ఎక్కువగా విల్లాలు ఉన్నాయి.

మల్లంపేట్‌ కత్వా చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఇవాళ ఉదయమే మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ విల్లాల వద్దకు అధికారులు, పోలీసులు చేరుకున్నారు. బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు విల్లాలకు సంబంధించిన యాజమానులు ఆందోళనకు దిగారు. నిబంధనల మేరకే తాము కొనుగోలు చేస్తామని చెబుతున్నారు.

ఇక మాదాపూర్, సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అపార్ట్మెంట్‌ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో పలువురు స్థానికులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని… ఇలా తమ ఇళ్లను కూల్చడమేంటని ప్రశ్నిస్తున్నారు,

జయభేరికి నోటీసులు:

హైదరాబాద్‌లోని జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చింది. జయభేరి కన్‌స్ట్రక్షన్స్ సినీ నటుడు మురళీమోహన్‌కు చెందినదని సమాచారం. గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్ కుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేస్తామని హైడ్రా వార్నింగ్ ఇచ్చింది.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్ కుంట చెరువును సందర్శించారు అక్కడ జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌ నిర్మాణాలను పరిశీలించారు. స్థానికులను, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్రమంగా నిర్మించారని నిర్ధారణకు వచ్చాక కూల్చివేత నోటీసులు ఇచ్చారు.

స్పందించిన మురళీమోహన్..

హైడ్రా నోటీసులపై సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు. తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదన్నారు. బఫర్ జోన్ లో మూడు అడుగుల మేరకు రేకుల షెడ్డు ఉన్నట్టు గుర్తించారని చెప్పారు. బఫర్‌జోన్‌లో ఉన్న రేకుల షెడ్డును తామే కూల్చివేస్తామని చెప్పారు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాని చెప్పుకొచ్చారు. మంగళవారంలోపు తాత్కాలిక షెడ్ తొలగిస్తామని పేర్కొన్నారు.

మరోవైపు హైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థను కూడా తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. సాధారణ పోలీసులను దీని అవసరాల కోసం వినియోగిస్తే రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని.. ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే జరిగితే.. దేశంలోనే నాలుగో ప్రత్యేక పోలీస్ వ్యవస్థ కానుంది. తెలంగాణలో ఇప్పటికే సైబర్‌ సెక్యూరిటీ, నార్కొటిక్స్‌ విభాగాలకు రెండు ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు.

హైడ్రాను మరింత విస్తరించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి వరకు ఉన్న హైడ్రాను.. హెచ్‌ఎండీఏ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి.. వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు కూడా నేలమట్టం కానున్నాయి.