Hydra: పటాన్‌చెరు, అమీన్‌పూర్ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. టెన్షన్‌లో అక్రమార్కులు!-hydra commissioner av ranganath inspected patancheru and ameenpur pond ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra: పటాన్‌చెరు, అమీన్‌పూర్ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. టెన్షన్‌లో అక్రమార్కులు!

Hydra: పటాన్‌చెరు, అమీన్‌పూర్ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. టెన్షన్‌లో అక్రమార్కులు!

HT Telugu Desk HT Telugu
Aug 31, 2024 06:16 PM IST

Hydra: హైదరాబాద్ చెరువుల్లో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా.. సంగారెడ్డి జిల్లాలో ఉన్న చెరువుల పైన ఫోకస్ పెట్టింది. అమీన్ పూర్, పటాన్‌చెరులో ఉన్న పలు చెరువుల్లో ఆక్రమణలు ఉన్నట్టు ఫిర్యాదులు రావటంతో.. అధికారులు ఈ ఆక్రమణల పైన దృష్టి పెట్టారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్, పటాన్‌చెరులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. పలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఆమీన్ పూర్ లోని శంభునికుంట, శంభికుంట, బంధం కొమ్ము, చక్రపురి కాలని, ఆమీన్ పూర్ పెద్ద చెరువులను పరిశీలించారు. చెరువుల కబ్జాలపై హైడ్రా కమిషనర్‌కి అడ్వకేట్ రవికృష్ణ ఫిర్యాదు చేశారు.

అన్ని చెరువుల తూములను కబ్జా చేసి.. కాలువలను మూసేసి అక్రమ నిర్మాణాలు చేసినట్టు హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు స్థానికులు. ఆక్రమణల పైన పూర్తి నివేదిక ఇవ్వాలని.. అధికారులను రంగనాథ్ ఆదేశించారు. స్థానిక ఇంజినీరింగ్, మున్సిపల్ అధికారులు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. శంభునికుంట, సాకి చెరువు, అమీన్ పూర్ పెద్ద చెరువు, బంధం కొమ్ము చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

పటాన్ చెరులోని సాకి చెరువుని కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. సాకి చెరువు కబ్జాకు గురికావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించినట్టు తెలిసింది. అధికారులు ఇప్పటికే చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సాకి చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 135 ఎకరాలు కాగా.. పదుల ఎకరాల్లో చెరువు కబ్జాకి గురైనట్టు అధికారులు గుర్తించారు. చెరువు తూములు బంద్ చేసి.. ఇన్ కోర్ సంస్థ అపార్ట్ మెంట్ కట్టినట్టు స్థానికులు రంగనాథ్ కు పిర్యాదు చేశారు.

ఇన్ కోర్ సంస్థ నిర్మించిన అపార్ట్ మెంట్‌లను రంగనాథ్ పరిశీలించారు. స్థానికంగా ప్రవహించే నక్క వాగు భఫర్ జోన్ కబ్జా చేసి.. బహుళ అంతస్తుల నిర్మాణాలపైనా హైడ్రా కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా అధికారులతో రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువుల్లో ఎలాంటి ఆక్రమణలు ఉన్నా.. గుర్తించి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ నివేదకను పరిలించిన తర్వాత.. ఆక్రమణలపై నిర్ణయం తీసుకొని కూల్చివేయనున్నట్టు సమాచారం.

తెల్లాపూర్‌పైనా ఫోకస్..

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో అభివృద్ధి చెందిన తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న చెరువులపైన హైడ్రా ఫోకస్ పెట్టింది. తెల్లాపూర్‌కు చెందిన కొంతమంది నాయకులు ఈ మధ్య రంగనాథ్‌ని కలిసి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. హైడ్రా కమిషనర్ ఇక్కడ కూడా త్వరలో పర్యటించి.. ఆక్రమణల పైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. హైడ్రా కమిషనర్ పర్యటనతో ఆక్రమణదారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కోట్లు పెట్టి కట్టిన తమ నిర్మాణాలు నేలమట్టం అవుతాయని ఆందోళన చెందుతున్నారు.

(రిపోర్టింగ్- హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)