TG MPs in Union Cabinet : కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణ స్వీకారం-hyderabad tg bjp mps kishan reddy bandi sanjay swearing as union ministers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Mps In Union Cabinet : కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణ స్వీకారం

TG MPs in Union Cabinet : కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణ స్వీకారం

Bandaru Satyaprasad HT Telugu
Jun 09, 2024 09:49 PM IST

TG MPs in Union Cabinet :దిల్లీ రాష్ట్రపతి భవన్ లో కేంద్ర మంత్రి వర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి ఎంపీలు బండి సంజయ్ , కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

 కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణ స్వీకారం
కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణ స్వీకారం

TG MPs in Union Cabinet : దిల్లీ రాష్ట్రపతి భవన్ లో ప్రధాని, కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశవిదేశాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ రెడ్డికి కేబినేట్ మంత్రి పదవి దక్కగా, బండి సంజయ్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది.

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు గెలుపొందగా అందులో ఇద్దరు ఎంపీలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి గెలుపొందిన బండి సంజయ్ లకు మోదీ కేబినెట్ లో చోటు దక్కింది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్, కరీంనగర్ స్థానాల నుంచి పోటీ చేసిన వీరిద్దరూ ఈసారి కూడా ఆ స్థానాల నుంచే బరిలో దిగి ఘన విజయం సాధించారు.

కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే

కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో జూన్ 15,1960లో జన్మించారు. టూల్ డిజైనింగ్ లో డిప్లొమా ఆయన విద్యార్హత. 1977 లో కిషన్ రెడ్డి జనతా పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. అంతకముందు ఆయన సంఘ్ కార్యకర్త. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువ మోర్చా కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక 2001 లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004 లో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేశారు. ఈ సమయంలోనే కిషన్ రెడ్డి బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. తొలిసారి హిమాయత్ నగర్ శాసన సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్ నగరంలో నియోజకవర్గాల పునర్విభజన వల్ల 2009లో అంబర్ పేట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

రెండోసారి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి

2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత మరోసారి కిషన్ రెడ్డి అంబర్ పేట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2016 నుంచి 2018 వరకు అసెంబ్లీలో బీజేపీ శాసన సభ పక్ష నేతగా కిషన్ రెడ్డి పని చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే మరికొన్ని నెలల్లోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంతటితో ఆగకుండా కేంద్ర మంత్రి పదవిని సైతం కిషన్ రెడ్డి అధిరోహించారు. గత మోదీ కేబినెట్ లో కిషన్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. 2023 జులైలో ఆయనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి సికింద్రాబాద్ నుంచి ఎన్నికైన ఆయనకు మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది. దీంతో ఆయన అనుచరులు, బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.

బండి సంజయ్ ప్రస్థానం

కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా 48వ డివిజన్ నుంచి 2005లో తొలిసారి బీజేపీ కార్పొరేటర్ గా, రెండోసారి 2010లో అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో బండి సంజయ్ విజయం సాధించారు. 2014, 2018, 2023 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2016లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకమయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరపున కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండో స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిల్చారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి, టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 89508 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబెర్ గా నియామకమై ఇంకా కొనసాగుతున్నారు.‌ 2019 అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబెర్ గా టొబాకో బోర్డు మెంబెర్ గా, మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబెర్ గా, 2020 ఎయిమ్స్ బీబీనగర్ బోర్డు మెంబెర్ గా నియామకమై ఇంకా కొనసాగుతున్నారు.

2020 మార్చి 11 నుంచి 2023 జులై 3 వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు బండి సంజయ్. 2023 జులై 8న జాతీయ కార్యవర్గ సభ్యులుగా, 29 జులై 2023న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియామకమయ్యారు. 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 89016 ఓట్లు సాధించి 3163 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2024 మే 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 5,85,116 ఓట్లు సాధించి, 2,25,209 మెజారిటీతో రెండోసారి ఎంపీగా ఘన విజయం సాధించారు. 2006 ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు 2,01,581 ఓట్లు రాగా, 2014లో వినోద్ కుమార్ కు 2,05,007 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఇవే అత్యధిక ఓట్లు కాగా.. తాజా ఫలితాలతో బండి సంజయ్ కుమార్ ఆ రికార్డులను బద్దలు కొట్టి, కరీంనగర్ చరిత్రలో మరో కొత్త రికార్డు నెలకొల్పారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

Whats_app_banner

సంబంధిత కథనం