AP TS Summer Holidays : వేసవి సెలవులు, ఎన్నికల ఎఫెక్ట్- రైలు టికెట్లన్నీ ముందే బుక్
AP TS Summer Holidays : తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెలలో స్కూళ్ల, కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ ఇస్తారు. వేసవి సెలవులు ప్రకటన రాకుండానే తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే రిజర్వేషన్లు వెయిటింగ్ లిస్టులు చూపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బెర్తులు ఫుల్ అవుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు.
AP TS Summer Holidays : ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Heat Wave) తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ఈసారి కాస్త ముందుగానే స్కూళ్లకు వేసవి సెలవులు(Summer Holidays) ప్రకటించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో ఇప్పటికే ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి. ఏపీలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులు(AP Summer Holidays) ప్రకటించే అవకాశం ఉంది. టెన్త్ విద్యార్థులకు ఇంకాస్త ముందుగానే సెలవులు ప్రకటిస్తారు. తెలంగాణలో ఇంచుమించూ ఇదే తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి టూర్లకు, దేవాలయాలకు వెళ్తుంటారు. దీంతో పాటు విద్యార్థులు అమ్మమ్మ, నాయనమ్మ గారి ఇళ్లకు వెళ్తుంటారు. సమ్మర్ లో తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. సమ్మర్ లో రైళ్లలోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఇంకా సమ్మర్ హాలీడేస్ ప్రకటించకుండానే ట్రైన్ టికెట్లు బుక్(Trains Reservations) అయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య తిరిగే రైళ్ల రిజర్వేషన్లు వెయిటింగ్ లిస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి.
ఎన్నికలు, వేసవి రద్దీ
ఇప్పటికే రైళ్లలో సీట్లన్నీ రిజర్వ్ అయ్యి బెర్తులు దొరకని పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికల పోలింగ్(Polling Day) ఉంది. ఈ నేపథ్యంలో కాస్త ముందుగానే ట్రైన్ రిజర్వేషన్లు ఫుల్ అయినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో సెలవులకు కుటుంబాలతో ఇతర ప్రాంతాలకు వెళ్దామనుకున్న వారికి నిరాశ ఎదురవుతుంది. ఎన్నికల(General Elections) కారణంగా ఈ పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రత్యేక రైళ్లే దిక్కని ప్రయాణికులు ఎదురుచూస్తు్న్నారు. సమ్మర్ స్పెషల్ ట్రైన్ కోసం వేచిచూస్తు్న్నారు. వేసవిలో సాధారణ బస్సుల్లో ప్రయాణాలు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దీంతో ఏసీ బస్సుల వైపు ప్రయాణికులు మొగ్గుచూపుతారు. అయితే సమ్మర్ లో ఏసీ బస్సుల్లో(AC Buses) ప్రయాణాలంటే సామాన్యుల జేబులకు చిల్లులు పడ్డట్టే.
రైళ్ల సంఖ్య పెంచాలని డిమాండ్
అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయాల్సిన వారు రైలు రిజర్వేషన్లు ఫుల్(Train Reservations) కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా స్కూళ్లకు, కాలేజీలకు ఒకటి రెండు రోజులు సెలవులు ఇస్తేనే రైళ్లు, బస్సులు కిటకిటలాడతాయి. ఇక వేసవి సెలవులు అంటే రద్దీ విపరీతంగా ఉంటుంది. చదువులు కోసం నగరాలకు వచ్చిన వాళ్లు తిరిగి గ్రామాలకు వెళ్తుంటారు. అయితే రద్దీ తగిన విధంగా రైళ్లు అందుబాటులో ఉండడం లేదని ప్రయాణికుల వాదన. స్పెషల్ ట్రైన్లు నడిపినా... అవి అంతంత మాత్రమేనని అంటున్నారు. దీంతో ఈ వేసవికి తెలుగు రాష్ట్రాల(Telugu States) మధ్య మరిన్ని రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
సంబంధిత కథనం