TS Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకంపై గుడ్ న్యూస్, బడ్జెట్ లో రూ.2418 కోట్లు కేటాయింపు
TS Gruha Jyothi Scheme : తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులకు పేదలకు శుభవార్త చెప్పింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకానికి భారీగా కేటాయింపులు చేసింది. ఈ పథకం అమలుకు కసరత్తు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు.
TS Gruha Jyothi Scheme : తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్(2024-25) శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో... తెలంగాణ ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ పెడతామన్నారు. తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్(2024- 25) లో రెవెన్యూ వ్యయం -2,01,178 కోట్లు, మూల ధన వ్యయం - 29,669 కోట్లు, ఆరు గ్యారెంటీల కోసం - రూ.53,196 కోట్లుగా అంచనా వేశారు.
గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు
రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. గృహ జ్యోతి పథకం అమలుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఉచిత విద్యుత్ గృహ జ్యోతి పథకానికి బడ్జెట్ లో రూ.2,418 కోట్లు కేటాయించామన్నారు. విద్యుత్ సంస్థలు ట్రాన్స్ కో, డిస్కమ్ లకు రూ.16,825 కోట్లు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు 2024-25:
- ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
- వ్యవసాయ రంగానికి రూ.19,746 కోట్లు
- ఐటీ శాఖకు రూ.774 కోట్లు
- విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
తెలంగాణ బడ్జెట్ లో విద్యారంగానికి రూ. 21,389 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగం గురించి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ...రాష్ట్రంలో రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన కరెంట్ అందించనున్నట్టు ప్రకటించారు. బడ్జెట్‌లో గృహనిర్మాణ శాఖకు రూ.7,740 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఇళ్లు లేనివారికి ఇల్లు, స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు స్కాలర్ షిప్‌లను విద్యార్థులకు సకాలంలో అందజేస్తామన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, అందుకు బడ్జె్ట్ లో రూ.500 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. గుజరాత్, దిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లో స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనానికి అధికారుల బృందం పంపుతున్నామన్నారు. ఓయూతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు కేటాయించామన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం కృషి చేస్తామని చెప్పారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.
సంబంధిత కథనం