Saddula Bathukamma: సద్దుల బతుకమ్మ ఎలా జరుపుకొంటారు? నైవేద్యాలు ఏంటి?-how saddula bathukamma celebrates here is details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  How Saddula Bathukamma Celebrates Here Is Details

Saddula Bathukamma: సద్దుల బతుకమ్మ ఎలా జరుపుకొంటారు? నైవేద్యాలు ఏంటి?

HT Telugu Desk HT Telugu
Sep 28, 2022 08:16 AM IST

Saddula Bathukamma: పూలపండుగతో తెలంగాణ కళకళలాడుతోంది. ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలే. తీరొక్క పువులతో పేర్చే బతుకమ్మ సంబురాలతో రాష్ట్రంలో సందడి నెలకొంది. తొమ్మిది రోజులు జరిగే.. బతుకమ్మ పండుగలో రోజుకో ప్రత్యేకత ఉంటుంది. చివరిరోజు సద్దుల బతుకమ్మ.. సందడి అంతా ఆ రోజే కనిపిస్తుంది.

బతుకమ్మ పండుగ
బతుకమ్మ పండుగ

Saddula Bathukamma: తెలంగాణలో ఊరూవాడలు పూలవనాలుగా మారాయి. పెత్రమాస నుంచి దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తూ.. ఆడుతారు. బతుకమ్మ వేడుకల్లో ప్రతి రోజూ.. ఓ ప్రత్యేకత. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మ తల్లికి సమర్పిస్తారు. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ అంటే.. ఇక ఆ సందడే వేరు. ప్రత్యేకమైన నైవేద్యాలు ఉంటాయి. సద్దుల బతుకమ్మ సాయంత్రం ముగింపు. బతుకమ్మ మీద కొలువైన గౌరమ్మను ఆ తల్లి గంగమ్మ ఒడిలో వదిలిపెట్టి మళ్లీ ఏడాది వరకు బతుకమ్మ కోసం ఎదురుచూసే రోజు అది.

ట్రెండింగ్ వార్తలు

బతుకమ్మ పండుగలో ప్రతి రోజు ప్రత్యేకం. మెుదటి రోజు.. ఎంగిలి పూల బతుకమ్మ తర్వాత అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ ఇలా ఒక్కో పేరుతో బతుకమ్మను కొలుస్తారు. ప్రత్యేకమైన ప్రసాదాలను నివేదిస్తారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మనాడు సత్తుపిండి, పెరుగన్నం, పులిహోర, మలీద ముద్దలు, కొబ్బరన్నం, నువ్వులన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.

సద్దుల బతుకమ్మ నాడు.. బతుకమ్మలు పెద్దగా పేరుస్తారు. తెచ్చిన పూలను.. జాగ్రత్తగా తాంబలంలో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. మెుదట తంగేడు ఆకులు, పూలు పళ్లెంలో పెడతారు. అనంతరం తంగేడు పూల కట్టలు ఒక్కటొక్కటిగా పేరుస్తారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను కూడా పెడతారు. తెల్లని గునుక పూలకు రంగులు అద్ది పేరుస్తారు.

బతుకమ్మను పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఆ తర్వాత బతుకమ్మను తీసుకెళ్లి.. ఇంట్లోని దేవుడిని కొలిచే ప్రదేశంలో పెడతారు. కొవ్వొత్తులతో, అగరొత్తులతో అలంకరించి పూజ చేస్తారు. సాయంత్రం పూట ఊరంతా ఒక్కసారిగా కదులుతుంది. అంతా సాయంకాలం బతకమ్మలతో ఒక చోటకు చేరుతారు. వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ పాడుతారు.

రాత్రి అవుతుండగా.. బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు వైపు వెళ్తారు. బతుకమ్మలతో దారి అంతా అత్యంత సుందరంగా కనిపిస్తుంటుంది. ఊరేగింపుగా వెళ్లినంతసేపు.. బతుకమ్మ పాటలు పాడుతారు. చెరువు వద్దకు చేరుకున్నాక.. మెల్లగా బతుకమ్మ పాటలు పాడుతూ నీటిలో జారవిడుస్తారు.

పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ, బతుకమ్మను కీర్తిస్తూ వస్తారు. 'మలీద' (చక్కెర, రొట్టెతో చేసింది) పిండి వంటకాన్ని పంచి పెట్టుకుంటారు. ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తుపిండిలను ఇచ్చి పుచ్చుకొని తింటారు.

IPL_Entry_Point