ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే శుక్రవారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. .జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కొండాపూర్, కొత్తగూడ, మియాపూర్, మెహిదీపట్నం, మలక్‌పేట్, చార్మినార్ తో పాటు పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది.
భారీ వర్షం నేపథ్యంలో హైడ్రా అలర్ట్ అయింది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సహాయం కోసం నగర వాసులు 040-21111111 or 9000113667 నెంబర్లను సంప్రదించాలని ఓ ప్రకటనలో తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉంది. మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం బలహీన పడినట్లు వాతావరణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది.
ఏపీలో చూస్తే రేపు (నవంబర్ 02)విజయనగరం,మన్యం,అల్లూరి,అనకాపల్లి,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,పల్నాడు,నెల్లూరు,శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.