Washington Sundar: ఐపీఎల్ వేలంలో వాషింగ్టన్ సుందర్‌పై కోట్ల వర్షం ఖాయమేనా.. స్పిన్నర్‌పై కన్నేసిన నాలుగు ఫ్రాంఛైజీలు
Washington Sundar: ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పై కోట్ల వర్షం కురవడం ఖాయం కనిపిస్తోంది. ఎందుకంటే అతనిపై ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు ఫ్రాంఛైజీలు కన్నేసినట్లు తాజాగా ఓ రిపోర్టు వెల్లడించింది.
Washington Sundar: వాషింగ్టన్ సుందర్.. టీమిండియా ఓడిపోయినా పుణె టెస్టుతో మరోసారి తెరపైకి వచ్చిన స్టార్ స్పిన్నర్. ఈ ఒక్క మ్యాచ్ ఐపీఎల్లో అతని దశ మార్చే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సుందర్ ను కొనుగోలు చేయడానికి ఏకంగా మూడు ఫ్రాంఛైజీలు పోటీ పడనున్నాయి. ఇక అతన్ని వదిలేసిన సన్ రైజర్స్ కూడా వేలంలో మరోసారి రైట్ టు మ్యాచ్ కార్డు కింద తిరిగే పొందే అవకాశం కూడా ఉంది.
వాషింగ్టన్ సుందర్.. దశ తిరిగినట్లేనా?
వాషింగ్టన్ సుందర్.. ఓ వారం కిందటి వరకు కూడా ఇండియన్ క్రికెట్ లో ఇతన్ని చాలా మంది మరచిపోయారు. ఒకప్పుడు జట్టుకు ఆడిన ఓ సాదాసీదా ప్లేయర్ గానే అతడు గుర్తున్నాడు. కానీ అనూహ్యంగా మూడున్నరేళ్ల తర్వాత పుణెలో న్యూజిలాండ్ తో రెండో టెస్టుకు ఎంపికైన అతడు.. ఏకంగా 11 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రదర్శన టీమిండియాను గెలిపించకపోయినా.. ఐపీఎల్లో సుందర్ దశ తిప్పేలానే కనిపిస్తోంది.
టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో మూడు టాప్ టీమ్స్ అతనిపై కన్నేశాయి. అతని కోసం బిడ్ వార్ జరిగితే మాత్రం కోట్ల వర్షం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నాడు. అయితే ఆ ఫ్రాంచైజీ అతన్ని రిటెయిన్ చేసుకోవడం లేదు. దీంతో సుందర్ వేలంలోకి వెళ్లడం ఖాయం.
ఆ మూడు ఫ్రాంఛైజీల కన్ను
టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ లాంటి ఫ్రాంఛైజీలు సుందర్ పై ఆసక్తి చూపుతున్నాయట. "సుందర్ వేలంలోకి వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నాడు.
ప్రస్తుతానికి కనీసం మూడు టీమ్స్ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్, సీఎస్కే అతనిపై ఆసక్తిగా ఉన్నాయి. అతడు సన్ రైజర్స్ రిటెయిన్ లిస్టులో ఉండే అవకాశం లేదు. అయితే తనకుండే రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా ఐపీఎల్ వేలంలో ఎస్ఆర్‌హెచ్ అతన్ని తిరిగి పొందే అవకాశం ఉంది" అని ఆ రిపోర్టు తెలిపింది.
సుందర్ ఐపీఎల్ కెరీర్ ఇలా..
వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్లో ఇప్పటి వరకూ మూడు ఫ్రాంఛైజీల తరఫున ఆడాడు. 2017లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, 2018 నుంచి 2021 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2022 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. మొత్తంగా 60 ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఆడిన అనుభవం సుందర్ కు ఉంది.
ఇందులో అతడు 37 వికెట్లు తీయడంతోపాటు 378 రన్స్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో ఈ ఏడాది సుందర్ కు కేవలం రెండే మ్యాచ్ లలో ఆడే అవకాశం దక్కింది. అందులో ఐదు ఓవర్లు వేసి ఒక వికెట్ మాత్రమే తీశాడు. అయితే న్యూజిలాండ్ తో పుణె టెస్టు తర్వాత సుందర్ మరోసారి హీరో అయ్యాడు. దీంతో ఈసారి ఐపీఎల్ వేలంలో అతడు ప్రత్యేక ఆకర్షణ కానున్నాడు.