Siddipet: చెట్లను సొంత బిడ్డల్లా పెంచుకున్నాం.. వాటిని నరికేయొద్దు: హరీష్ రావు-harish rao serious about the officials who are cutting trees in siddipet ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet: చెట్లను సొంత బిడ్డల్లా పెంచుకున్నాం.. వాటిని నరికేయొద్దు: హరీష్ రావు

Siddipet: చెట్లను సొంత బిడ్డల్లా పెంచుకున్నాం.. వాటిని నరికేయొద్దు: హరీష్ రావు

HT Telugu Desk HT Telugu
Aug 26, 2024 06:01 PM IST

Siddipet: సిద్దిపేటలో అధికారులు, ప్రజా ప్రతినిధులు 20 సంవత్సరాలు కష్టపడి చెట్లను పెంచారని.. వాటిని సొంత బిడ్డల్లా చూసుకున్నామని హరీష్ రావు అన్నారు. వాటిని నరకొద్దని ట్రాన్స్‌కో అధికారులను కోరారు.

విద్యుత్ అధికారులతో మాట్లాడుతున్న హరీష్ రావు
విద్యుత్ అధికారులతో మాట్లాడుతున్న హరీష్ రావు

మాజీమంత్రి హరీష్ రావు.. సిద్దిపేటలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మెదక్ రోడ్డులో వెళ్తున్నారు. ఈ సమయంలో ట్రాన్స్‌కో అధికారులు కూలీలను పెట్టి చెట్లను కొట్టిస్తున్నారు. ఇది చూసిన హరీష్.. తన వాహనం అపారు. చెట్లను ఎందుకు నరుకుతున్నారని ప్రశ్నించారు. అవి కరెంటు తీగలను తాకుతున్నాయని.. అందుకే నరకమని అధికారులు ఆదేశాలు ఇచ్చారని కూలీలు బదులిచ్చారు. చెట్ల కొమ్మలు తీగలకు తగిలితే.. కొమ్మల మాత్రమే నరకాలని.. చెట్లను నరికితే ఎలా అని ప్రశ్నించారు. తాము పడ్డ శ్రమ వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి..

విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో హరీష్ రావు ఫోన్‌లో మాట్లాడారు. చెట్లు నరికేయాలని ఆదేశాలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిద్దిపేటలో వేలాది చెట్లు పెట్టి.. పట్టణాన్ని పచ్చగా మార్చామని వివరించారు. అధికారులు నిర్లక్ష్యంగా చెట్లను మొదటికి నరుకుతున్నారని బాధపడ్డారు. ప్రతి సంవత్సరం చెట్ల కొమ్మల వరకు నరికితే సరిపోతుందని.. అధికారులకు చూచించారు.

మొట్టమొదటి విగ్రహం సిద్దిపేటలో..

సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ రోడ్డులో కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. హైదరాబాద్ తొలి మేయర్‌గా కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ నగరానికి ఎంతో సేవ చేశాని గుర్తు చేశారు. వారి అడుగుజాడల్లో ముదిరాజ్ సమాజం ముందుకు సాగాలని సూచించారు. అనేక పదవులు ఇచ్చి ముదిరాజులను గౌరవించుకున్నామని హరీష్ వివరించారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించుకున్నామని చెప్పారు.

ముస్తాబాద్ చౌరస్తా ఇక కృష్ణ స్వామి చౌరస్తా..

ముదిరాజ్ రిజర్వేషన్‌కు బీఆర్ఎస్ సహకరిస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు. మత్స్యకారులకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కొత్త సభ్యత్వ కార్డులను బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ముదిరాజులు కృష్ణ స్వామి మార్గంలో ఐక్యంగా ముందుకు సాగాలని.. వారి విగ్రహాన్ని చూసినప్పుడు మరింత స్ఫూర్తిని పొందాలన్నారు. ఈ చౌరస్తాని కృష్ణస్వామి జంక్షన్‌గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

( రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )