Siddipet Robbery : సిద్దిపేటలో పట్టపగలే చోరీ, కూతురింటికి వెళ్లి వచ్చేలా ఇల్లు గుల్ల
Siddipet Robbery : సిద్దిపేటలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. శ్రీనగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో రెండు ఇళ్లలో చోరీ చేశారు. 14 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ. 2. 20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
Siddipet Robbery : సిద్దిపేటలో పట్టపగలే దొంగతనం జరగడం స్థానికంగా సంచలనం రేపింది. ఆదివారం పట్టపగలే గుర్తు తెలియని దుండగులు ఒకే అపార్ట్మెంట్ లోని తాళం వేసిన రెండిళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. 14 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ. 2. 20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీలో చోటుచేసుకుంది.
సిద్దిపేట శ్రీనగర్ కాలనీలో చిగుళ్ళపల్లి కృష్ణమూర్తి, శ్రీలక్ష్మి దంపతులు కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఆయన పెద్ద కోడూరులో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. కాగా ఆ దంపతులు వారం రోజుల కిందట కూతురు డెలివరీకి పూణేకి వెళ్లారు. అనంతరం మూడు రోజుల క్రితం కృష్ణమూర్తి పూణే నుంచి ఇంటికి వచ్చారు. రెండు రోజులు ఇంట్లో ఉండి శనివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ లో ఉంటున్న చిన్న కూతురు దగ్గరికి వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 14 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ.20 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు కృష్ణమూర్తి తెలిపారు. పక్కింటి వారి ద్వారా ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలుసుకున్న భార్యాభర్తలు వెంటనే సిద్దిపేటకు చేరుకున్నారు. తిరిగొచ్చేసరికి ఇంట్లో సామాను చిందరవందరగా పడి ఉందని వారు తెలిపారు.
మరో ఇంట్లో 20 తులాల వెండి, నగదు
అనంతరం అదే అపార్ట్మెంట్ లోని పై అంతస్థులో నివసిస్తున్న ఆకుల రాజు బయటికి వెళ్లగా, భార్య పిల్లలను తీసుకొని రావడానికి స్కూల్ కి వెళ్లింది. ఆమె తిరిగి వచ్చే లోపు ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న రూ. 2 లక్షల 5 వేల నగదు, 20 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఆమె ఇరుగుపొరుగు వారి సహాయంతో భవనం మొత్తం పరిశీలించారు. గౌండ్ ఫ్లోర్ లో ఉన్న యజమాని ఇంటితో పాటు తమ ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. మూడో అంతస్థులో ఉన్న మరో ఇంటి తాళాలు పగులగొట్టిన అక్కడ వారికి ఏమి దొరకలేదని చెప్పారు. దీంతో బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి, బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని క్లూస్ టీమ్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఒకేరోజు మూడు ఇళ్లల్లో దొంగలు పడేసరికి కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
సంబంధిత కథనం