TS Assembly Elections : కారు 'సీటు'పై కన్ను...! వెనక్కి తగ్గని 'ముదిరాజ్' నేతలు
Mudiraj Communities Protest For BRS Tickets: బీఆర్ఎస్ లోని ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన పలువురు నేతలు టికెట్ల కోసం తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇది కాస్త అధికార బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది.
Telangana Assembly Elections : వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం 115 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక్క సీటు కూడా ముదిరాజ్ సామాజికవర్గానికి దక్కలేదు. దీంతో ఆ సాామాజికవర్గానికి చెందిన నేతలు…. పోరాటబాట పట్టారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంగా తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న తమకు ఐదు సీట్లు కేటాయించాలనే డిమాండును తెరపైకి తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఇదే అధికార బీఆర్ఎస్ కు అతిపెద్ద తలనొప్పిగా మారింది. కీలకమైన సామాజికవర్గాన్ని విస్మరిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందన్న వాదనను సొంత పార్టీ నేతలే తెరపైకి తీసుకువస్తున్నారు.
సంగారెడ్డిలో డీసీసీబీ వైస్-చైర్మన్ పట్నం మాణిక్యం ముదిరాజ్, పటాన్చెరులోని చిట్కుల్ గ్రామ సర్పంచ్ గా ఉన్న నీలం మధు ముదిరాజు తమ వర్గానికి సరైన అవకాశాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో తమకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటించింది బీఆర్ఎస్. అయితే ముదిరాజుల నిరసనల నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపై గులాబీ బాస్ తీవ్రంగానే ఆలోచిస్తున్నారట..!
వెనక్కి తగ్గని నేతలు….
పట్నం మాణిక్యం, నీలం మధు ముదిరాద్ ఇద్దరు కూడా పట్టువదలని విక్రమార్కుల వలె టికెట్ కోసం పోరాడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ తరపున టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇవ్వకపోయినా బరిలో ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే నీలం మధుని ప్రగతి భవన్ కి పిలిపించారు మంత్రి హరీశ్ రావ్. టికెట్ దక్కించుకున్న మహిపాల్ రెడ్డి సమక్షంలోనే మాట్లాడి సర్ది చెప్పారు. అయినప్పటికీ… టికెట్ పై మధు వెనక్కి తగ్గటం లేదు. శనివారం పటాన్ చెరులో భారీ ర్యాలీని నిర్వహించారు. తప్పకుండా తనకు టికెట్ కేటాయించాలని.. బీసీలతో పాటు అన్ని సామాజికవర్గాలు అంతా తన వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఓవైపు ముఖ్యమంత్రిని, మంత్రి హరీష్ రావుని పొగుడుతూనే… చీమల వలే అందరం కలిసి పటాన్చెరులో ఉన్న కొండచిలువల పని పడుదామంటూ కామెంట్స్ చేశారు. పార్టీ అవకాశం ఇవ్వకపోతే,.. స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని మధు ప్రకటించడం పటాన్చెరు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి.
సంగారెడ్డిలో కూడా పదిరోజుల కింద పట్నం మాణిక్యం తన పుట్టినరోజు సందర్బంగా... పట్టణంలో పెద్ద ర్యాలీ తీశారు. ఈ సందర్బంగా తాను తప్పకుండ బిఆర్ఎస్ అబ్యర్ధిగానే బరిలో ఉంటానని ప్రకటించడంతో… పార్టీ వర్గాలని ఆందోళనలోకి నెట్టింది. అంతకుముందు సంగారెడ్డి టికెట్ కోసం పులిమామిడి ముదిరాజు ప్రయత్నించారు. అయితే చింతా ప్రభాకర్ ను ప్రకటించటంతో ఆయన… పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఇక సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లోని ముదిరాజ్ సామాజికవర్గానికి చెంది నేతలు…. ఆందోళనలు, నిరసన గళాలను వినిపిస్తున్నారు. తమ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి ఆందోళనల వెనక టికెట్లు ఆశిస్తున్న నేతలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ముదిరాజు వర్గానికి చెందిన ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు కీలక వ్యక్తిగా ఉండటంతో… మెజార్టీ వర్గం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఈటల బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత…. బీఆర్ఎస్ లో బండా ప్రకాష్ కీలక నేతగా తెరపైకి వచ్చారు. ప్రస్తుతం మండలి ఛైర్మన్ గా ఉన్నారు.