Cyber Crime : డేటా ఎంట్రీ జాబ్స్ పేరిట వల, రూల్స్ బ్రేక్ చేశారని ఫేక్ నోటీసులు-సైబర్ కేటుగాళ్ల సరికొత్త మోసం!
Cyber Crime : పార్ట్ టైమ్ జాబ్స్ అంటూ వల విసిరి డబ్బులు దోచేస్తున్న సైబర్ కేటుగాళ్ల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటూ ఉద్యోగాలు ఇచ్చి కంపెనీ రూల్స్ అతిక్రమించారంటూ ఫేక్ నోటీసులు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
Cyber Crime : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. ప్రజల్ని బురిడీ కొట్టించి డబ్బులు దోచేయాలనే ఉద్దేశంతో పూటకో కొత్త ఐడియా వేస్తున్నారు. తాజాగా పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పార్ట్ టైమ్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి డేటా ఎంట్రీ ఆపరేటర్ గా అవకాశం కల్పిస్తామని ఓ ముఠా నమ్మించింది. ఆ తర్వాత కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారని బెదిరిస్తూ వారిని నుంచి డబ్బులు వసూలుకు పాల్పడింది. ఈ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్‌లోని సూరత్‌లో అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా బాధితులు
డేటా ఎంట్రీ పేరుతో ఈ గ్యాంగ్ ఉద్యోగులకు లాగిన్ ఐడీ ఇచ్చి పనిచేయమని చెబుతోంది. అయితే తాము చెప్పిన విధంగా పనిచేయలేదని, కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారని ఉద్యోగులకు ఫేక్ నోటీసులు పంపి బెదిరింపులకు పాల్పడుతుంది. ఆ తర్వాత బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు. ఇలా చాలా మందిని మోసం చేసిన ఎవరూ బయటకు రాలేదని తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఫేక్ నోటీసులకు భయపడి ఏకంగా రూ.6.17 లక్షలు చెల్లించింది. చివరకు మోసపోయామని తెలుసుకున్న ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో ఆరా తీసిన పోలీసులకు.. ఈ ముఠా వ్యవహారం తెలిపింది. దీంతో రంగంలోకి శనివారం నలుగురి నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠాపై మొత్తం 350కి పైగా కేసులు ఉండగా, తెలంగాణలోనే 28 ఉన్నట్లు పోలీసులుగు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.
షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరిట మోసాలు
షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. అధిక లాభాలు ఆశ చూపి ఓ మహిళ నుంచి రూ.3.16 కోట్లు కాజేశారు. అయితే ఈ కేసులో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. సైబర్ కేటుగాళ్లతో కుమ్మకైన గుజరాత్ బ్యాంక్ అధికారులు...అకౌంట్లు ఇచ్చారు. హైదరాబాద్ మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బ్యాంక్ అధికారులతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
నాకు కూడా సైబర్ నేరగాళ్ల కాల్స్ వచ్చాయి- డీజీపీ
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సెల్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సైబర్ క్రైమ్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ నకు డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు హాజరయ్యారు. సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించేందుకు ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రవి గుప్తా మాట్లాడుతూ... తనకు కూడా సైబర్ క్రిమినల్స్ కాల్స్ వచ్చాయన్నార. యూట్యూబ్‌లో వీడియోలకు లైక్స్ కొడితే ఇస్తామని కాల్స్ చేశారన్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లపై అలర్ట్‌గా ఉండాలన్నారు. టెక్నాలజీతో లాభాలకన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి తాను రెండు బ్యాంక్ ఖాతాలను మెయింటెన్ చేస్తున్నానన్నారు. ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి వస్తే మెయిన్ అకౌంట్ నుంచి కాకుండా రెండో అకౌంట్ కు నగదు ట్రాన్స్ ఫర్ చేసుకుని ఆ అకౌంట్ వాడుతున్నట్లు చెప్పారు. మొబైల్‌లో యాప్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇచ్చే అనుమతుల పట్ల అలర్ట్‌గా ఉండాలన్నారు. కర్ణాటక డీజీపీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారన్నారు.
సంబంధిత కథనం