Cyber Frauds: ఆరు గ్యారంటీల పేరుతో సైబర్ మోసాలు.. బీ అలర్ట్
Cyber Frauds:ఆరు గ్యారెంటీలకు అప్లై చేశారా..? అంటూ ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Cyber Frauds: "సర్ నమస్తే.. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు కాల్ చేస్తున్నాము.. మీరు ఆరు గ్యారెంటీ పథకాలకు అప్లై చేసుకున్నారు కదా..? అయితే మీకు ఆ పథకాలు వర్తించాలంటే మీ ఫోన్ కి ఒక ఓటీపీ పంపుతున్నాము.. దయచేసి ఆ నెంబర్ చెప్పండి. ఆ వెంటనే మీరు దరఖాస్తు చేసుకున్న స్కీం మీకు వర్తిస్తుంది.."
ఈ తరహా ఫోన్ కాల్స్ వస్తే తస్మాత్ జాగ్రత్త.! పొరపాటున ఓటీపీ చెప్పారో మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు ఒక్క రూపాయి కూడా లేకుండా ఖాళీ అయినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆరు గ్యారెంటీల దరఖాస్తుదారులే అస్త్రంగా సైబర్ నేరగాళ్లు వల విసురున్నారు. ఇప్పటికే పలువురికి ఈ తరహా ఫోన్లు వస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఇలా పలువురికి ఈ తరహా ఫోన్లు రావడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆరా తీసిన పోలీసులకు నివ్వెరపోయే నిజం తెలిసింది. ఇది సైబర్ నేరగాళ్ల పనేనని భావించిన పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
"తెలంగాణ ప్రజలారా అలర్ట్..! ప్రజా పాలనలో ఆరు గ్యారెంటీ లకు దరఖాస్తు ఇచ్చారా..? మీకు పథకాలు మంజూరు చేస్తామని చెప్పి మొబైల్ ఓటీపీ అడిగే ఫోన్ కాల్ మీకు కూడా రావొచ్చు. ఏమరపాటులో ఓటీపీ చెబితే ఖాతా ఖాళీ అయినట్లే లెక్క. ఓటీపీ చెప్పి డబ్బులు పోగొట్టుకోకండి" అంటూ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఈ సందేశంతో వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి మరీ అలెర్ట్ చేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కాల్ కట్ చేయమని చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున ఓటీపీ చెప్పినా ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుకు 6వ తేదీతో గడువు ముగియగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి 25 లక్షల అప్లికేషన్లు వచ్చిన సంగతి తెలిసిందే.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం)