Telangana Govt : ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం - సీఎం రేవంత్ ఆదేశాలు-cm revanth reddy has given orders to set up biometrics in anganwadi centers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Revanth Reddy Has Given Orders To Set Up Biometrics In Anganwadi Centers

Telangana Govt : ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం - సీఎం రేవంత్ ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 03, 2024 06:30 AM IST

Biometrics in Anganwadis : అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న 35 వేల అంగన్ వాడీ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వాటి పరిధిలో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి (CMO Twitter)

CM Revanth Review On Anganwadi Centers : అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy). పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఎన్హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ఆరోగ్య ప్రమాణాలు పెరగాల్సింది పోయి, దిగజారటం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. శనివారం అధికారులతో సమీక్షించిన ఆయన... అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా.. లేదా పక్కాగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

కేవలం రికార్డుల్లో రాసుకొని పౌష్ఠికాహారం దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బయో మెట్రిక్ అమలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న 35 వేల అంగన్ వాడీ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వాటి పరిధిలో బయోమెట్రిక్ విధానం(Biometrics in Anganwadis) ఏర్పాటు చేయాలని సూచించారు. ఆడిటింగ్ వీలుండేలా అన్ని రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచాలని చెప్పారు.

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభాకు సరిపడే అంగన్వాడీ కేంద్రాలు లేనందున, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవం నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే శానిటరీ నాప్కిన్స్ వినియోగంపై బాలికలకు అవగాహన కల్పించి, నాప్కిన్స్ పంపిణీ చేయాలని చర్చ జరిగింది. స్వయం సహాయక సంఘాల మహిళలతో శానిటరీ నాప్కిన్స్ తయారీ చేయించాలని, అందుకు అవసరమైన యూనిట్లు నెలకొల్పాలని ఆదేశించారు. విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న వాటిలో ఇప్పటికే 12,315 అంగన్ వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. వీటికి సొంత భవనాలను నిర్మించే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యతగా అంగన్వాడీ భవన నిర్మాణాలు చేపడుతామని చెప్పారు.

రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకే డిజైన్తో అంగన్వాడీ కేంద్రాల బ్రాండింగ్ ఉండాలని సీఎం పలు సూచనలు చేశారు. చూడగానే ఆకర్షించేలా అంగన్వాడీ కేంద్రాల భవనాలన్నింటికీ ప్రత్యేకంగా డిజైన్ చేయాలని చెప్పారు. మాతా, శిశు సంక్షేమం ఉట్టిపడే చిత్రాలు, ఆకర్షించే రంగులతో ఈ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దాలని చెప్పారు. అవసరమైతే ఆరేండ్ల లోపు చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సూచించారు.

రిజర్వేషన్లను అమలు చేయండి - సీఎం రేవంత్ రెడ్డి

దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. చట్ట ప్రకారం ఉద్యోగాల్లో 4 శాతం, విద్యావకాశాల్లో 5 శాతం, అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఫైలు సిద్ధం చేసి పంపించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని చెప్పారు. ట్రాన్స్ జెండర్లకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్లోనే వారికి చికిత్సలు చేస్తున్నారనే చర్చ జరిగింది. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ అన్నిట్లో ట్రాన్స్ జెండర్లకు వైద్య చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పథకాలన్నీ వారికి వర్తించేలా, వారికి సరైన అవకాశాలు కల్పించేందుకు, సంక్షేమానికి వీలుగా ప్రత్యేక విధానాన్ని తయారు చేయాల్సి ఉందని అన్నారు.

IPL_Entry_Point