Human Trafficking : 'ప్రతి చిన్నారినీ కాపాడుకుందాం' - 'క్రై' విశ్లేషణలో కీలక విషయాలు
World Day Against Human Trafficking: ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో మానవ అక్రమ రవాణా కూడా ఒకటి. దీని ద్వారా ఎంతో మంది అమాయకులు జీవితాలు బలి అవుతున్నాయి. ఇది తెలంగాణలో కూడా క్రమంగా పెరుగుతోంది. తాజా పరిస్థితులపై చైల్డ్ రైట్స్ అండ్ యు(CRY) విశ్లేషణలో పలు విషయాలను పేర్కొంది.
World Day Against Human Trafficking: "ప్రతి ఒక్క అక్రమ రవాణా బాధితులనూ చేరుకోవాలి.. ఎవరినీ వదిలివేయవద్దు" అనేది ఈ ఏడాది మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం థీమ్‌గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. భారతదేశంలో మానవ అక్రమ రవాణా బాధితుల్లో చిన్నారుల సంఖ్య చాలా అధికంగా ఉంటోంది. కాబట్టి ప్రతి ఒక్క చిన్నారికీ సమర్థవంతమైన భద్రతా వలయం ఉండేలా చూడాలని CRY పిలుపునిస్తోంది. మానవ అక్రమ రవాణా అనేది ఒక "కనిపించని" నేర కార్యకలాపమని పరిగణిస్తారు. అందువల్ల, అది ఎంత తీవ్రంగా ఉందనేది తెలియజేసే విశ్వసనీయమైన సమాచారం, గణాంకాలు సంసిద్ధంగా అందుబాటులో లేవు. మనకు తెలిసిన లేదా నమోదైన కేసుల సంఖ్య.. అసలు ట్రాఫికింగ్ కేసుల్లో కొంత భాగం మాత్రమే. అసలు ట్రాఫికింగ్ కేసుల వాస్తవ విస్తృతి ఎంతగా ఉందనేది తెలియదు. కాబట్టి, వివిధ స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమ రవాణాకు గురైన పిల్లల సంఖ్య ఖచ్చితంగా ఎంత అనేది తెలుసుకోవటం అసాధ్యం. అయినప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ఇటీవలి గణాంకాలు బాలల అక్రమ రవాణా ఆందోళనకరమైన పరిస్థితిని చాటుతున్నాయి. ఈ దారుణ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి.
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు...
NCRB గణాంకాల ప్రకారం, 2021 లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 222 మంది పిల్లలు (18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) అక్రమ రవాణాకు గురయ్యారు. వారందరినీ యంత్రాంగం రక్షించింది కూడా. ప్రధానంగా లైంగిక దోపిడీ కోసం, శ్రమ దోపిడీ కోసం ఈ మానవ అక్రమ రవాణా జరిగినట్లు ఆ నివేదిక చెప్పింది. కానీ, ఇదే నివేదికలో అదృశ్యమైన చిన్నారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రంలో 2021 సంవత్సరంలో 2,574 మంది బాలికలు సహా మొత్తం 3,956 మంది చిన్నారులు (18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) అదృశ్యమైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇక మునుపటి సంవత్సరాలలో అదృశ్యమై ఆచూకీ దొరకని చిన్నారుల సంఖ్య 777 మంది (420 మంది బాలికలతో సహా) గా ఉంది. అంటే, 2021 చివరి నాటికి అదృశ్యమైన పిల్లల మొత్తం సంఖ్య 4,733 కాగా.. వీరిలో 2,994 మంది బాలికలు ఉన్నారు. 2021 లో 2,603 మంది బాలికలు సహా 4,079 మంది పిల్లల ఆచూకీని గుర్తించటం లేదా తిరిగి తేవటం జరిగింది. మిగిలిన 654 మంది (వారిలో 391 మంది బాలికలు) చిన్నారుల ఆచూకీ తెలియలేదు.
పెరుగుతున్న కేసులు...
మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, అక్రమ రవాణాకు గురవుతున్న, అదృశ్యమవుతున్న చిన్నారుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. తెలంగాణలో ట్రాఫికింగ్‌కు గురైన చిన్నారుల సంఖ్య 2019 లో 71గా ఉంటే.. 2021 లో 222 కి పెరిగినట్లు NCRB గణాంకాలు చూపుతున్నాయి. అంటే ఈ సంఖ్య మూడేళ్లలో 212 శాతానికి పైగా పెరిగింది. అలాగే, నాలుగు నెలల పాటు లాక్‌డౌన్లు కొనసాగిన 2020 సంవత్సరంలో సైతం.. రాష్ట్రంలో 32 మంది చిన్నారులు అక్రమ రవాణాకు గురయ్యారని ఆ నివేదిక చెప్తోంది. రాష్ట్రంలో అదృశ్యమైన పిల్లల సంఖ్య 2019 లో 3,308 గా ఉండగా.. 2021 లో 3,956 కి పెరిగింది. అంటే మూడేళ్లలో 20 శాతం ఎక్కువయింది. 2020 లో కూడా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా మార్చి నుండి జూన్ వరకు దేశవ్యాప్తంగా నాలుగు నెలల పాటు పూర్తి లాక్‌డౌన్ ఉన్నప్పటికీ, రాష్ట్రంలో 3,100 మంది చిన్నారులు అదృశ్యమైనట్లు నివేదిక చెప్తోంది. వీరిలో 1,870 మంది బాలికలు ఉన్నారు.
కలిసి పనిచేద్దాం - జాన్ రాబర్ట్స్
CRY - చైల్డ్ రైట్స్ అండ్ యు సౌత్ ఇండియా రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ మాట్లాడుతూ, ‘‘చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఒక జుగుప్సాకరమైన నేరం. చిన్నారుల బాల్యాన్ని, వారి భవిష్యత్తును ఇది కాలరాస్తుంది. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా.. ఈ దారుణానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, తెలంగాణలోని ప్రతి చిన్నారి భద్రతను, శ్రేయస్సును బలోపేతం చేయాలని మేం కోరుతున్నాం’’ అని పిలుపునిచ్చారు. ‘‘ఒక సమాజంగా, ఈ సంక్షోభం తీవ్రతను గుర్తించడం, మన పిల్లలను దోపిడీ నుంచి, హింస నుంచి రక్షించడానికి మనమంతా చేతులు కలపడం అత్యవసరం’’ అని జాన్ పేర్కొన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం బాలల హక్కులను కాపాడటానికి, బాలల అక్రమ రవాణాను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని జాన్ రాబర్ట్స్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఇతర భాగస్వాములు తమ కృషిని తీవ్రతరం చేయాలని ఆయన కోరారు.
ప్రభుత్వ యంత్రాంగం: ట్రాఫికర్లను అరెస్టు చేయడానికి చట్ట అమలు వ్యవస్థను బలోపేతం చేయాలి, అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా వ్యవస్థలను అడ్డుకోవటానికి రాష్ట్రాల మధ్య సహకారం మెరుగుపడాలి
ప్రజా సమూహాలు: చిన్నారుల అక్రమ రవాణాను ముందుగా లేదా సత్వరం గుర్తించి, ఫిర్యాదు చేసేలా.. చైల్డ్ ట్రాఫికింగ్ ఆనవాళ్ల గురించి అవగాహన పెంపొందించాలి.
స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం: ట్రాఫికింగ్ నుంచి రక్షించిన చిన్నారుల కోసం బలమైన మద్దతు వ్యవస్థను రూపొందించడానికి.. విద్య, ఆరోగ్య సంరక్షణ, పునరావాసం అందించడానికి కలిసి పని చేయాలి.
సాధారణ ప్రజలు: పిల్లల హక్కులను కాపాడటానికి, చిన్నారులకు స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించటానికి చేపట్టే కార్యక్రమాలకు క్రియాశీలంగా మద్దతు ఇవ్వాలి.
అవగాహన కార్యక్రమాలు :
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని, CRY తన భాగస్వామ్య సంస్థలతో కలిసి తెలంగాణలోని ఖమ్మం, మేడ్చల్ జిల్లాల్లో వారం పాటు అవగాహన, చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. ఈ అవగాహన జూలై 25, 2023 నుండి ప్రారంభమై జూలై 31, 2023 వరకు కొనసాగుతుంది, ఇందులో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు:
⦁ కిశోర బాలికలు, తల్లిదండ్రులు, గ్రామ బాలల రక్షణ కమిటీలు, ఇతర సామాజిక సంస్థలకు.. బాలల అక్రమ రవాణా గురించి అవగాహన కల్పించటం
⦁ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు వంటి ముందు వరుసలోని భాగస్వాములకు.. బాలల అక్రమ రవాణా, దానిని నివారించే చర్యల మీద అవగాహన కల్పించటం
⦁ ఐసీపీఎస్, పోలీసులు (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు), ఐసీడీఎస్, సీడబ్ల్యూసీ, రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్, పంచాయతీ రాజ్, ఐకేపీ, హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాల ప్రతినిధులతో పంచాయతీ/మండల/ డివిజన్/జిల్లా స్థాయిల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించటం
⦁ ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో ప్రయాణికులు, విక్రేతలు, అధికారులకు ట్రాఫికింగ్ సమస్యపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం
‘‘ప్రతి చిన్నారీ ట్రాఫికింగ్ ముప్పు లేకుండా స్వేచ్ఛగా, సురక్షితమైన వాతావరణంలో పెరిగే పరిస్థితి ఉండాలని CRY బలంగా విశ్వసిస్తుంది. బాలల హక్కుల కోసం CRY స్థిరంగా కట్టుబడి ఉంది. దుర్బలమైన చిన్నారులను అక్రమ రవాణా నుండి రక్షించడానికి తన నిరంతర కృషినికొనసాగిస్తుంది’’ అని జాన్ రాబర్ట్స్ చెప్పారు.
CRY సంస్థ గురించి:
CRY - 'Child Rights and You' ఒక భారతీయ NGO. ప్రతి చిన్నారికీ జీవించే, నేర్చుకునే, పెరిగే, ఆడుకునే హక్కు ఉందని CRY విశ్వసిస్తుంది. CRY నాలుగు దశాబ్దాలుగా, తన 850 క్షేత్రస్థాయి కార్యక్రమాల ద్వారా తల్లిదండ్రులు, సామాజిక బృందాలతో కలిసి పనిచేస్తూ భారతదేశంలోని 19 రాష్ట్రాలలో 30,00,000 మందికి పైగా అణగారిన, వెనుకబడిన చిన్నారుల జీవితాల్లో శాశ్వత మార్పును సాకారం చేసింది. ఈ ఎన్ జీవో గురించి తెలుసుకునేందుకు www.cry.org ను సందర్శించవచ్చు.
E-mail id: prithviraju.p@crymail.org,
Phone no: +91 99485 92340
(డిస్‌క్లెయిమర్: పై కథనంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణ CRY సంస్థవి. హెచ్‌టీ తెలుగువి కావు.)