Dasoju Sravan : బీఆర్ఎస్ నేత శ్రవణ్‌కు అర్ధరాత్రి బెదిరింపు కాల్స్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు
Dasoju Sravan Police Complaint: బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటిపై ఆయన నగర పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు ఈ బెదిరింపు కాల్స్ ను ఖండించారు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావ్. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Dasoju Sravan Fires On Revanth Reddy: రేవంత్ రెడ్డి అనుచరుల మంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని అన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. అర్ధరాత్రి ఫోన్ చేస్తూ .. అంతు చూస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారని వెల్లడించారు. ఇదే విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్లో అసభ్య పదజాలం వాడుతూ..రేవంత్ రెడ్డి ని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని తెలిపారు. హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత పోలీసు అధికారులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కాల్స్ చేయించి బెదిరిస్తావా..? దాసోజు శ్రవణ్
రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత దిగజారుడుతనానికి పాల్పడుతున్నావు అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి భాష వినడానికి కూడా బాధకలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. "బుద్ధిలేదా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. తెలంగాణ సాధించి… దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను చార్లెస్ శోభరాజ్ అంటావా..? బీసీ నాయకులైన గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను అన్న మాటాలకు నీకు బుద్ధిలేదా అని అన్నాను. దానికి నువ్వు దొంగ కాల్స్ చేయించి మమ్మల్ని బెదిరిస్తావా..? బీసీ నాయకులంటే పడతలేదా..?" అని శ్రవణ్ ప్రశ్నించారు.
"ఇవాళ దేశానికే తలమానికంగా తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే..అది చూసి ఓర్వలేక తండ్రి వయసున్న కేసీఆర్ ని పట్టుకొని చార్లెస్ శోభరాజ్ అంటావా..?ఇలా ఇష్టవచ్చినట్లు కేసీఆర్ ని అంటుంటే..మేము మాత్రం నిన్ను ఏమి అనొద్దా రేవంత్ రెడ్డి…? కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావ్ వాళ్లపై ఇష్టానుసారంగా మాట్లాడుతుంటావ్. మహిళలను వదిలిపెట్టవు.. నాయకులని వదిలిపెట్టవు..వ్యాపారస్తులను వదిలిపెట్టవు ..చిన్న , పెద్ద ఏమిలేదు..ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావ్..బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడతావ్. మరో నయీమ్ లెక్క మారావ్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ని నడుపుతున్నట్లు లేదు ఓ దండుపాళ్యం బ్యాచ్ నడుపుతున్నట్లు ఉంది" అని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖండించిన కేటీఆర్, హరీశ్ రావ్…
దాసోజు శ్రవణ్ కు బెదిరింపు కాల్స్ అంశంపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావ్ స్పందించారు. బెదిరింపు ఘటనలను సీరియస్‌గా తీసుకుని, చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని హోం మంత్రి మహముద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్‌ను కేటీఆర్ కోరారు. ఇక మంత్రి హరీశ్ రావ్ మీడియాతో మాట్లాడుతూ… రాజకీయంగా విమర్శలను ఎదుర్కొలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని దుయ్యబట్టారు. రాజకీయంగా ఎదుర్కొలేక… వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగే పరిస్థితి కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రవణ్ కు బెదిరింపు కాల్స్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.