Munugodu Bypoll : మునుగోడులో బీజేపీ కొత్త వ్యూహం... గతానికి భిన్నంగా అడుగులు
bjp steering committee in munugodu: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు బైపోల్ ఉపఎన్నిక కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ పోరులో ప్రధాన పార్టీలు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే తాజాగా బీజేపీ సరికొత్త స్ట్రాటజీ అమలు చేసే పనిలో పడింది.
bjp new startagey in munugodu bypoll: రాష్ట్ర రాజకీయ పరిస్థితులను మార్చే ఉపఎన్నిక కావడంతో అందరి చూపు మునుగోడు వైపు మళ్లింది. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు చేయటంతో పాటు గ్రౌండ్ లో సీరియస్ గా తిరిగేస్తోంది. ఇక ఆత్మీయ సమ్మేళనాల పేరుతో టీఆర్ఎస్ కూడా ఓ మాత్రం తగ్గటం లేదు. వీరిద్దరూ ఇలా ఉంటే... బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ధీటుగా పావులు కదిపేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను తనవైపు తిప్పేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్రనాయకత్వం కూడా మునుగోడుపై ఫోకస్ పెంచేసింది. తాజాగా సరికొత్త వ్యూహాన్ని అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది.
స్టీరింగ్ కమిటీ.. మాజీ ఎంపీకి ఛాన్స్
నియోజకవర్గానికి సంబంధించి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది కమలదళం. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామిని ఆ కమిటీ ఛైర్మన్ గా నియమించింది. స్టీరింగ్ కమిటీలో మరో 14 మంది సభ్యులుగా వ్యవహరించనున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్ రెడ్డిని స్టీరింగ్ కమిటీ కో ఆర్డినేటర్గా నియమించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులగా కీలక నేతలను నియమించారు. దాదాపు కీలక సామాజికవర్గాలను ప్రాధాన్యం ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది.
ఈసారి భిన్నంగా...
మునుగోడు బైపోల్ విషయంలో బీజేపీ కాస్త భిన్నంగా అడుగులు వేసింది. దుబ్బాక, హుజురాబాద్ తరహాలో ఉప ఎన్నిక ఇంచార్జ్ అని కాకుండా స్టీరింగ్ కమిటీ అని ప్రకటించింది. ఇది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారిందనే టాక్ కూడా వస్తోంది. అయితే మునుగోడు బైపోల్ ఇంఛార్జ్ కోసం కొందరు పోటీ పడ్డారనే టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఒకర్ని ఛైర్మన్ గా నియమించటంతో పాటు... కీలక నేతలను కమిటీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. బీజేపీ గత రెండు ఉపఎన్నికల్లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బాధ్యతలను ఇచ్చింది. దుబ్బాకతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నికలను కూడా జితేందర్ రెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. ఆ రెండు చోట్లా విజయం సాధించింది. అయితే అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి ఉండటం, ఇంఛార్జ్ కూడా అదే సామాజికవర్గానికి వారికి ఇస్తే సరికాదనే అభిప్రాయానికి అధినాయకత్వం వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దళిత వర్గానికి చెందిన వివేక్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి కూడా ఆయనకే కాస్త మొగ్గు చూపినట్లు సమాచారం.
సభ్యులు వీరే...
ఈ స్టీరింగ్ కమిటీలో చూస్తే సభ్యులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి, రవీంద్ర నాయక్, రాపోలు ఆనంద్ భాస్కర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారితో పాటు పార్టీలే కొత్తగా చేరిన దాసోజు శ్రవణ్ కు కూడా చోటు కల్పించారు.
మొత్తంగా వచ్చే నెలలో మునుగోడు షెడ్యూల్ రావటం పక్కా అని రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. నవంబరులో ఎన్నిక జరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్న నేపథ్యంలో... వ్యూహాలు రచించటంలో వేగం పెంచుతున్నారు. ప్రత్యర్థి పార్టీల బలబలాను అంచనా వేస్తూ ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి అధికారంగా ఖరారైతే పిక్చర్ క్లియర్ కట్ గా ఉంటుంది. వీటన్నింటిపై ఓ అంచనాతో ఉన్న కమలనాథులు.... కీలక నేతలందర్నీ బరిలోకి దింపేలా స్టీరింగ్ కమిటీతో ముందుకొచ్చింది.
సంబంధిత కథనం