Munugode by election: మునుగోడు ఉప ఎన్నికలో జాప్యంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం-who will benefit if the munugode by election is delayed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Who Will Benefit If The Munugode By-election Is Delayed?

Munugode by election: మునుగోడు ఉప ఎన్నికలో జాప్యంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం

Praveen Kumar Lenkala HT Telugu
Sep 07, 2022 10:03 AM IST

Munugode by election: మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జాప్యమైతే ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరికి నష్టం వాటిల్లుతుంది?

మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (HT_PRINT)

Munugode by election: మునుగోడు ఉప ఎన్నిక ఇప్పటికిప్పుడు జరిగితే లేదా ఆలస్యమైతే ఏ పార్టీ లాభపడుతుంది? ఏ పార్టీ నష్టపోతుందన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఇంకా సానుకూల వాతావరణం కోసం ఎదురుచూస్తున్నదెవరు? రాజకీయ వర్గాలు ఏమంటున్నాయి?

ట్రెండింగ్ వార్తలు

బీజేపీకి లాభమా? నష్టమా?

మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌తో గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరిపోయారు. మునుగోడులో ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా దీనిని సెమీఫైనల్స్‌గా మార్చి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు పొందాలని బీజేపీ ఆశించింది. కోమటిరెడ్డితో పాటు ఇంకా ఒకరో ఇద్దరో వస్తే మరింత రసవత్తరంగా ఉంటుందని భావించింది. 

కానీ రాజగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలోకి రాలేదు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌కు దక్కినంత సానుభూతి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో దక్కలేదు. ఈటల రాజీనామ నేపథ్యం ఇందుకు భిన్నంగా ఉండడమే కారణం. ఆయనను బలవంతంగా మంత్రివర్గం నుంచి తప్పించారన్న సానుభూతి ఏర్పడింది. కేసీఆర్ తదనంతరం టీఆర్ఎస్‌లో అత్యంత సీనియర్, అనుభవశాలిగా ఉండడం వల్ల స్వేచ్ఛాయుత నిర్ణయాలకు అడ్డుపడుతున్నారనే ఈటలను తప్పించారన్న వాదన జనంలోకి వెళ్లింది. తెలంగాణలో బలమైన బీసీ నాయకుడిగా ఎదగడాన్ని కొన్ని వర్గాలు జీర్ణించుకోలేకపోయాయన్న వాదన విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. ఈటల తొలుత బీజేపీలోకి వెళ్లడాన్ని స్థానికులు, ఆయన అభిమానులు, రాజకీయ విశ్లేషకులు ప్రతికూల అభిప్రాయాలు వెలువరించినప్పటికీ.. చివరకు ఈటల నెగ్గారు. 

హుజురాబాద్‌లో ఈటల గెలుపును బీజేపీ తన విజయంగా తీసుకుని మునుగోడు కూడా తమ ఖాతాలో పడుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే అవుతుంది. ముందే చెప్పుకున్నట్టుగా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యం, మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వైరుద్ధ్యం ఉంది. అవమానం, ఆత్మగౌరవ నినాదాలు ఇక్కడ పనిచేయవు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు నాలుగేళ్లుగా తరచూ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై, ఏఐసీసీ ఇంఛార్జులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పార్టీలో పదవులు రాకపోవడంపై అసంతృప్తి వెళ్లగక్కుతూ వచ్చారు. దీనికి తోడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నప్పుడు కాంట్రాక్టుల కోసమే మారుతున్నారన్న వాదనను కాంగ్రెస్ బలంగా తన శ్రేణుల్లోకి తీసుకెళ్లగలిగింది. దీంతో రాజగోపాల్ రెడ్డి ఎలాంటి సెంటిమెంటును, బీజేపీ ఎలాంటి క్యాడర్‌నూ పొందలేకపోయింది. 

అందువల్ల ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక జరగడం వల్ల మునుగోడులో తమ బలం పెరిగే పరిస్థితి లేదని నెమ్మదిగా బీజేపీ గ్రహిస్తోంది. పార్టీ అగ్రనాయకత్వాన్ని మునుగోడుకు తీసుకువస్తున్నప్పటికీ, బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర నిర్వహించినప్పటికీ మునుగోడులో తన బేస్ పెంచుకోలేకపోయింది. ఇంకా ఆలస్యమైతే బాగుండునన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు అవగతమవుతోంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ, సీబీఐ సోదాల ప్రక్రియ పూర్తయి, చార్జ్‌షీట్ జారీ అయితే కొంత అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందని ఆశిస్తోంది.

టీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?

మునుగోడులో 2018లో కాంగ్రెస్ గెలుపొందింది. ఇది వామపక్షాలు, కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం. రెడ్డి సామాజిక వర్గం నుంచి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వస్తున్నప్పటకీ.. ఇక్కడ బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీసీల ఓట్లపై విశ్వాసంతో ఉంది. పైగా వామపక్ష పార్టీలు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించాయి. అనూహ్యంగా ఎదురైన మునుగోడు సవాలును స్వీకరించడంలో తొలుత తడబాటు కనిపించినా.. ఇప్పుడు గట్టి విశ్వాసంతో టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఇప్పటికే గతంలో ఇచ్చిన హామీలైన 57 ఏళ్లకే పెన్షన్, నేతన్నలకు పెన్షన్ వంటి పథకాల అమలుపై శ్రద్ధ పెడుతోంది. ఈక్షణం ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఆలస్యమైతే బీజేపీ నేతలు ఇదివరకే ఆరోపించినట్టుగా ఈడీ, సీబీఐ సంస్థల నుంచి ముప్పు ఎదురవుతుందని, ఇది మునుగోడులో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించవచ్చని భావిస్తోంది. అలాగే అభ్యర్థి ఎంపిక విషయంలో ఎదురైన అసంతృప్తి జ్వాలలు విస్తృతమైతే కూడా టీఆర్ఎస్‌కు నష్టమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మునుగోడును కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా?

ఇటీవ‌ల టీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశంలో సీఎం కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మునుగోడులో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల జ‌రిగితే టీఆర్ఎస్, కాంగ్రెస్ మ‌ధ్యే ప్రధాన పోటీ ఉంటుంద‌ని చెప్పారట. కాంగ్రెస్‌కు వాడవాడలా పటిష్టమైన క్యాడర్ ఉండడం, వారంత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట బీజేపీలోకి వెళ్లకపోవడం పార్టీ ఆత్మవిశ్వాసం చెక్కుచెదరకుండా ఉంది. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన వెంటనే మునుగోడులో నిర్వహించిన సభ విజయవంతమవడం దగ్గరి నుంచి ఇప్పటి వరకు అక్కడ క్యాడర్‌ను క్రియాశీలకంగా ఉంచడంలో పీసీసీ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. అయితే రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మునుగోడులో కొట్లాడడం సవాలుగా మారింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్న ప్రజా వ్యతిరేకత మునుగోడులో కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుంది. పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ప్రభుత్వాల హామీలు నెరవేరకపోవడం వంటి అంశాలు కాంగ్రెస్‌కు కలిసి వస్తాయి. ఎన్నికల నాటికి బరిలో బలంగా నిలబడితే గెలుపు తథ్యమనే విశ్వాసంతో ఉంది. అందువల్ల మునుగోడు ఉప ఎన్నిక ఆలస్యంగా వచ్చినా, ఇప్పుడే వచ్చినా కాంగ్రెస్ విజయావకాశాల్లో పెద్దగా మార్పు ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక దగ్గరి నుంచి ఎన్నిక వరకు పార్టీ ఏకతాటిపై నిలబడితే బలంగా ఢీకొట్టగలదని అంచనా వేస్తున్నారు.

IPL_Entry_Point