Attack On BRS MP : ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి - ఆస్పత్రికి తరలింపు
BRS MP Kotha Prabhakar Reddy: బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన గాయపడగా… యశోదా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
BRS MP Kotha Prabhakar Reddy:సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి జరిగింది. చెప్పాలా గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎంపీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద కు తరలిస్తున్నారు.
ఈ ఘటన విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ వెంటనే హైదరాబాద్ కు బయల్జేరారు. ఫోన్ లో ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు దాడి చేసిన వ్యక్తిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగటంతో గాయపడ్డాడు.
ఇక ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే బీఫామ్ అందుకున్న ఆయన… కొద్దిరోజులుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై కత్తితో దాడి జరగటం… సంచలన పరిణామంగా మారింది.
కత్తితో దాడి ఘటనపై సిద్ధిపేట సీపీ శ్వేతారెడ్డి స్పందించారు. కత్తితో దాడి చేసిన వ్యక్తి రాజు అని… చెప్యాలకు చెందినవాడిగి గుర్తించినట్లు చెప్పారు. దాడి చేసిన టైంలో రాజు మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
తీవ్రంగా ఖండించిన హరీశ్ రావు
కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు మంత్రి టి .హరీష్ రావు. ప్రభాకర్ రెడ్డి పై దాడి అత్యంత గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యం లో హింస కు తావు లేదని.. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రభాకర్ రెడ్డి కి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోధ ఆస్పత్రికి తరలించామని… కత్తిపోటు తో కడుపులో గాయాలయ్యాయని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ,బీ ఆర్ ఎస్ కేడర్ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని….అధైర్య పడవద్దని సూచించారు. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనేకోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు.