Rahul Dravid Tests Positive: టీమిండియాకు షాక్.. కోచ్ ద్రవిడ్‌కు కరోనా
Rahul Dravid Tests Positive: టీమిండియాకు షాక్ తగిలింది. ఆసియా కప్‌కు ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్ కొవిడ్ బారిన పడటం టీమ్‌కు మింగుడు పడటం లేదు.
Rahul Dravid Tests Positive: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కొవిడ్ బారిన పడ్డాడు. ఆసియాకప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుండగా.. ఇండియన్ టీమ్‌కు ఇది పెద్ద దెబ్బే. ఈ మెగా టోర్నీ జరగనున్న యూఏఈకి ఇండియన్ టీమ్ బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో ద్రవిడ్‌కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో అతడు ఎప్పుడు టీమ్‌తో చేరతాడన్నది స్పష్టంగా తెలియడం లేదు.
నిజానికి వెస్టిండీస్ టూర్ తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేలకు రెస్ట్ ఇచ్చారు. వీళ్లు జింబాబ్వే టూర్‌కు వెళ్లలేదు. ఆ బాధ్యతలను ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ చూసుకున్నాడు. జింబాబ్వే టూర్‌లో టీమిండియా కోచ్‌గా లక్ష్మణే ఉన్నాడు.
ఈ ఏడాది ఐర్లాండ్ టూర్‌కు కూడా లక్ష్మణ్ తాత్కాలికంగా కోచ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ద్రవిడ్ సీనియర్ టీమ్‌తో కలిసి ఇంగ్లండ్‌లో ఉండటంతో లక్ష్మణ్‌కు తొలిసారి ఆ బాధ్యతలు ఇచ్చారు.
ఇప్పుడు ద్రవిడ్‌కు కరోనా సోకడంతో ఆసియాకప్‌లోపు అతడు కోలుకుంటాడా లేదా అన్నది తెలియడం లేదు. ఒకవేళ ద్రవిడ్ అందుబాటులో లేకపోతే ఆసియాకప్‌కు కూడా లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తాడా అన్నది కూడా తేలాల్సి ఉంది.
ఆసియాకప్‌లో భాగంగా వచ్చే ఆదివారం (ఆగస్ట్ 28) పాకిస్థాన్‌తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. గాయం కారణంగా స్టార్ పేస్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఇప్పటికే టీమ్‌కు దూరమైన విషయం తెలిసిందే. కోచ్ ద్రవిడ్ ఇప్పుడు టీమ్‌తో చేరకపోతే అది కెప్టెన్ రోహిత్ శర్మకు కాస్త లోటుగానే చెప్పాలి. ఈ ఇద్దరి జోడీ ఇండియన్ టీమ్ టీ20 క్రికెట్ ఆడే విధానాన్నే మార్చేసింది.
సంబంధిత కథనం