Uthappa on Gill: గిల్ కచ్చితంగా కోహ్లి, సచిన్ అంతటి వాడు అవుతాడు: మాజీ క్రికెటర్
Uthappa on Gill: గిల్ కచ్చితంగా కోహ్లి, సచిన్ అంతటి వాడు అవుతాడని అన్నాడు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప. ఈ మధ్యే గిల్ ఐపీఎల్లో తన తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Uthappa on Gill: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కచ్చితంగా కోహ్లి లేదా సచిన్ అంతటి వాడు అవుతాడని అన్నాడు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప. ఈ ఏడాది టీ20, వన్డే, టెస్టు క్రికెట్ తోపాటు ఐపీఎల్లోనూ సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా గిల్ నిలిచిన విషయం తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో గిల్ సెంచరీ చేశాడు.
ఆ మ్యాచ్ లో అతడు 58 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. తనకు అచ్చొచ్చిన నరేంద్ర మోదీ స్టేడియంలోనే గిల్ తన తొలి ఐపీఎల్ సెంచరీ అందుకున్నాడు. ఐపీఎల్లోకూ కేకేఆర్ నుంచి గుజరాత్ టైటన్స్ కు మారినప్పటి నుంచీ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. గత సీజన్ తో పాటు ఈసారి కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ.. గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
"విరాట్ కోహ్లి లేదా సచిన్ టెండూల్కర్ అంతటి గొప్ప ప్లేయర్ అవుతాడని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. అతనిలో ఆ సామర్థ్యం ఉంది. అతడో అద్భుతమైన ప్లేయర్. టాప్ ఫామ్ లో ఉన్నాడు" అని ఉతప్ప్ అన్నాడు. ఈ సందర్భంగా అతడు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గురించి కూడా స్పందించాడు.
"నా వరకూ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇండియన్ క్రికెట్ ను ఏలుతారు. వరల్డ్ కప్ తర్వాత భారీ మార్పులు జరగొచ్చు" అని ఉతప్ప అనడం విశేషం. నిజానికి యశస్వి ఆట చూసిన అతన్ని వన్డే వరల్డ్ కప్ కు ఎంపిక చేయాలని కెవిన్ పీటర్సన్, సురేశ్ రైనాలాంటి మాజీ క్రికెటర్లు కూడా అన్నారు. అయితే వరల్డ్ కప్ కు అతన్ని ఎంపిక చేస్తే టీమ్ ప్లాన్స్ దెబ్బ తినే ప్రమాదం ఉన్నదని ఉతప్ప అన్నాడు.
"ఇండియన్ టీమ్ తో నాకున్న అనుభవం ప్రకారం చూస్తే.. వాళ్లు అనుభజ్ఞులకే అవకాశం ఇస్తారు. ఎందుకంటే వరల్డ్ కప్ కు కొన్నాళ్ల ముందు ఇలాంటి మార్పులు చేయడం సరికాదు. నాకు తెలిసి ఫామ్ తాత్కాలికం. వరల్డ్ కప్ తర్వాత భారీ మార్పులు ఉండొచ్చు. కొందరి గాయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బుమ్రా వరల్డ్ కప్ వరకూ ఫిట్ నెస్ సాధిస్తాడని అనుకుంటున్నా. రాహుల్, రిషబ్ పంత్ ల గాయాల గురించీ ఆలోచించాలి" అని ఉతప్ప అన్నాడు.
సంబంధిత కథనం