SRH vs GT: ప్లేఆఫ్స్‌లోకి ఎంటరైన హార్దిక్ సేన - సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన గుజరాత్
SRH vs GT: ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి ప్లేఆఫ్స్ బెర్తును గుజరాత్ టైటాన్స్ ఖరారు చేసుకున్నది. సోమవారం సన్‌రైజర్స్‌ను 34 పరుగుల తేడాతో ఓడించిన గుజరాత్ ప్లేఆఫ్స్‌లోకి ఎంటరైంది.
SRH vs GT: ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 34 పరుగులు తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయాన్ని అందుకున్నది. శుభ్‌మన్‌గిల్ సెంచరీతో మెరవగా...బౌలింగ్‌లో షమీ, మోహిత్ శర్మ తలో నాలుగు వికెట్లతో రాణించడంతో సన్‌రైజర్స్‌పై ఈజీ విక్టరీని అందుకున్నది గుజరాత్.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 రన్స్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో రాణించాడు. 58 బాల్స్‌లో 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 101 రన్స్ చేశాడు. అతడితో పాటు సాయిసుదర్శన్ 36 బాల్స్‌లో 47 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ పూర్తిగా విఫలమయ్యారు.
189 పరుగుల టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ ఇరవై ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేసింది. క్లాసెన్ (44 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 64 రన్స్) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ నుంచి అతడికి సరైన సహకారం లభించలేదు. చివరలో భువనేశ్వర్ (26 బాల్స్‌లో 27 రన్స్) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా ఓటమి అంతరాన్ని తగ్గించగలిగాడు తప్పితే సన్‌రైజర్స్‌కు విజయాన్ని అందించలేకపోయాడు.
గుజరాత్ బౌలర్లలో షమీ, మోహిత్ శర్మ తలో నాలుగు వికెట్లతో సన్‌రైజర్స్ పతనాన్ని శాసించారు. సన్‌రైజర్స్‌పై విజయంతో 18 పాయింట్స్‌తో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో టాపర్‌గా నిలిచిన గుజరాత్ ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్నది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.