De Villiers on IPL 2023 best player: ఐపీఎల్ 2023లో బెస్ట్ ప్లేయర్ ఎవరు? మూడు సెంచరీలు బాదిన శుభ్‌మన్ గిల్ లేదంటే రెండు సెంచరీలు బాదిన విరాట్ కోహ్లి? ఈ ఇద్దరూ కాదంటే ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడంతోపాటు ఎన్నో సంచలన ముగింపులు అందించిన రింకూ సింగా? నిజానికి మాజీ ఆర్సీబీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ప్రకారం వీళ్లెవరూ కాదు.
అతని దృష్టిని బాగా ఆకర్షించిన ప్లేయర్ యశస్వి జైస్వాల్ అట. అందరి కంటే ఎంతో ముందు జైస్వాలే ఉంటాడని ఏబీ స్పష్టం చేశాడు. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించకపోయినా.. ఈ యువ బ్యాటర్ మాత్రం అందరినీ ఆకర్షించాడు. అతడు 14 మ్యాచ్ లలో 48 సగటుతో 625 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 163.61 కాగా.. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు.
ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడని జైస్వాల్.. ఈ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ తో టీమిండియా తలుపు తట్టినట్లే. దీంతో జియోసినిమాతో మాట్లాడుతూ.. ఏబీ అతనిపై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ 2023లో తన ఫేవరెట్ ప్లేయర్ జైస్వాలే అని స్పష్టం చేశాడు.
"నా వరకూ యశస్వి జైస్వాలే. మిగతా వాళ్ల కంటే చాలా ముందున్నాడు. యువ ప్లేయర్ అతడు. క్రికెట్ బుక్ లోని అన్ని షాట్లు ఆడగలడు. క్రీజులో ఎంతో సహనంతో ప్రశాంతంగా కనిపిస్తాడు. బౌలర్లను డామినేట్ చేస్తాడు. ఎప్పుడూ నియంత్రణలోనే ఉన్నట్లు కనిపిస్తాడు. శుభ్‌మన్ గిల్ కాస్త పెద్దవాడు. జైస్వాల్ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. గొప్ప ప్లేయర్ అయ్యే లక్షణాలు అతనిలో పుష్కలంగా ఉన్నాయి" అని ఏబీ డివిలియర్స్ అన్నాడు.
జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినా రాయల్స్ మాత్రం ఐదోస్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది టాప్ ఫామ్ లో కనిపించిన జోస్ బట్లర్ ఈ ఏడాది బోల్తా పడటం రాయల్స్ కొంప ముంచింది. ఈసారి అతడు ఏకంగా ఐదుసార్లు డకౌటయ్యాడు.
సంబంధిత కథనం