IPL 2023 Best Playing XI: లీగ్ స్టేజ్‌‌లో అత్యుత్తమంగా ఆడిన 11 మంది ఆటగాళ్లు.. కోహ్లీ నుంచి రింకూ సింగ్ వరకు-best playing xi of league stage of ipl 2023 from kohli to rinku singh ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Best Playing Xi: లీగ్ స్టేజ్‌‌లో అత్యుత్తమంగా ఆడిన 11 మంది ఆటగాళ్లు.. కోహ్లీ నుంచి రింకూ సింగ్ వరకు

IPL 2023 Best Playing XI: లీగ్ స్టేజ్‌‌లో అత్యుత్తమంగా ఆడిన 11 మంది ఆటగాళ్లు.. కోహ్లీ నుంచి రింకూ సింగ్ వరకు

Maragani Govardhan HT Telugu
May 23, 2023 11:16 AM IST

IPL 2023 Best Playing XI: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ ముగిసింది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు అర్హత సాధించిన జట్లు సిద్ధంగా ఉన్నాయి. దీంతో లీగ్ దశ వరకు అత్యుత్తమంగా ఆడిన 11 మంది ఆటగాళ్ల జాబితాను ఇప్పుడు చూద్దాం.

లీగ్ దశ వరకు బెస్ట్ ప్లెయింగ్ ఎలెవన్
లీగ్ దశ వరకు బెస్ట్ ప్లెయింగ్ ఎలెవన్

IPL 2023 Best Playing XI: ఐపీఎల్ 2023 సీజన్‌ చివరి వారానికి వచ్చేసింది. ఇంకో మూడు మ్యాచ్‌లతో సీజన్ ముగియనుంది. ప్లేఆఫ్స్ కోసం అన్నీ జట్లు తీవ్రంగా కృషి చేయగా.. చివరకు గుజరాత్, చెన్నై, లక్నో, ముంబయి ఇండియన్స్ జట్లు అర్హత సాధించాయి. బెంగళూరుపై గుజరాత్ విజయం సాధించడంతో ముంబయి జట్టు ప్లేఆఫ్స్‌కు దూసుకొచ్చింది. ఈ సీజన్‌లో చాలా మంది యువ ఆటగాళ్లు తమదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. యశస్వీ జైస్వాల్, ఆయుష్ బదోనీ, రింకూ సింగ్ లాంటి ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌ ఆరంభమయ్యే ముందు ఇప్పటి వరకు ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా బెస్ట్ ప్లెయింగ్ ఎలెవన్ గురించి చూద్దాం.

ఫాఫ్ డుప్లెసిస్..

ఆర్సీబీ కెప్టెన్ ఇప్పటి వరకు టోర్నీలో అత్యధిక పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. 14 మ్యాచ్‌ల్లో 56.15 సగటుతో 730 పరుగులు చేశాడు. ఇందులో 8 అర్ధశతకాలు ఉన్నాయి. అతడు అద్భుతంగా ప్రదర్శన చేసినప్పటికీ బెంగళూరు మాత్రం ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. మిడిల్ ఆర్డర్‌లో మెరుగైన ఆటగాడి దొరికినట్లయితే ఆర్బీబీ కూడా ప్లేఆఫ్స్‌కు వచ్చేదే.

శుబ్‌మన్ గిల్..

గుజరాత్ ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ రెండు సెంచరీలు చేసిన శుబ్‌మన్ గిల్ అకట్టుకునే ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 56.67 సగటుతో 680 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఇందులో రెండు సెంచరీలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి. గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన గిల్.. ప్లేఆఫ్స్‌లోనూ సత్తా చాటాలని చూస్తున్నాడు.

విరాట్ కోహ్లీ..

ఈ ఏడాది ఓపెనర్‌గా ఆర్సీబీ తరఫున అత్యుత్తమ ఆటతీరును కనబర్చాడు కోహ్లీ. చివర ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రెండు సెంచరీలు చేసిన కోహ్లీ..ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో మూడో స్థానానికి సరిగ్గా సరిపోతాడు. 14 మ్యాచ్‌ల్లో అతడు 53.25 సగటుతో 639 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 6 అర్ధశతకాలు ఉన్నాయి.

సూర్యకుమార్ యాదవ్..

టీ20ల్లో నెంబర్ 4 స్థానంలో మెరుగ్గా రాణిస్తున్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. అలాగే ఈ ఐపీఎల్‌లో ఆ స్థానంలో అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కష్ట సమయాల్లో ముంబయి జట్టును పలుమార్లు విజయ తీరాలకు చేర్చాడు. 14 మ్యాచ్‌ల్లో అతడు 42.58 సగటుతో 511 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం సహా 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

హెన్రిక్ క్లాసెన్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ ఏడాది అత్యంత నిలకడగా ఆడిన ఆటగాడు హెన్రిక్ క్లాసెన్ మాత్రమే. ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేయడమే కాకుండా ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 12 మ్యాచ్‌ల్లో అతడు 49.78 సగటుతో 448 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ సహా 2 అర్ధశతకాలు ఉన్నాయి.

రింకూ సింగ్..

ఈ సీజన్‌లో మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు రింకూ సింగ్. ఆరో స్థానానికి అతడు బాగా సరిపోతాడు. కేకేఆర్ తరఫున అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు 14 మ్యాచ్‌ల్లో 59.25 సగటుతో 474 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

రషీద్ ఖాన్..

ఎప్పుడూ తన స్పిన్ మాయాజాలంతో అద్భుతాలు చేసే రషీద్.. ఈ సారి బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 95 పరుగులే చేసిన ఆతడు ఇందులో ఓ అర్ధ సెంచరీ చేయడం గమనార్హం. ఇంక వికెట్ల విషయానికొస్తే 14 మ్యాచ్‌ల్లో 7.80 ఎకానమీ రేటుతో 24 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు. 7వ స్థానంలో ఈ బౌలింగ్ ఆల్ రౌండర్ సరిపోతాడు.

మహమ్మద్ షమీ..

ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. 15 మ్యాచ్‌ల్లో 7.70 ఎకానమీ రేటుతో 24 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. తన బౌలింగ్ ప్రదర్శనతో గుజరాత్ విజయాల్లో షమీ కీలక పాత్ర పోషించాడు.

పియూష్ చావ్లా..

9వ స్థానంలో పియూష్ చావ్లా కూడా బాగా సరిపోతాడు. ఈ సీజన్‌లో అతడు ముంబయి ఇండియన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరడంతో పియూష్ పాత్ర చాలానే ఉంది. 14 మ్యాచ్‌ల్లో 7,81 ఎకానమీ రేటుతో 20 వికెట్లు తీశాడు పియూష్.

యజువేంద్ర చాహల్..

ఐపీఎల్‌లో అత్యధిక నిలకడగా రాణిస్తున్న బౌలర్ యజువేంద్ర చాహల్. ఈ సీజన్‌లోనూ అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 8.17 ఎకానమీ రేటుతో 21 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆరంభంలో విజయాలు రావడానికి చాహల్ కూడా ఓ కారణం. పెద్ద భాగస్వామ్యాలు విడదీయాలనుకున్నప్పుడల్లా కెప్టెన్ సంజూ శాంసన్.. చాహల్‌నే ప్రయోగించేవాడు.

తుషార్ దేశ్‌పాండే..

ఎంఎస్ ధోనీ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అలా ఈ సీజన్‌లో అతడు సపోర్ట్ చేసిన పేసర్ తుషార్ దేశ్‌పాండే. సీఎస్‌కే పవర్ ప్లేలో కీలక వికెట్ టేకర్‌గా అతడు ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా దీపక్ చాహర్ దూరమైనప్పుడు తుషార్ చక్కటి ప్రదర్శనతో రాణించాడు. 11వ నెంబర్ స్థానంలో ఈ పేసర్ తప్పకుండా ఉండాలి. 14 మ్యాచ్‌ల్లో తుషార్.. 9.52 ఎకానమీ రేటుతో 20 వికెట్లు తీశాడు.

Whats_app_banner