Kohli in London: లండన్‌లో కోహ్లి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెడీ
Kohli in London: లండన్‌లో అడుగుపెట్టాడు విరాట్ కోహ్లి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెడీ అయ్యాడు. ఆదివారం (మే 21) ఐపీఎల్లో తన చివరి మ్యాచ్ ఆడిన విరాట్.. నాలుగు రోజులు ఆగి లండన్ ఫ్లైటెక్కాడు.
Kohli in London: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం లండన్ వెళ్లాడు విరాట్ కోహ్లి. ఆస్ట్రేలియాతో జూన్ 7 నుంచి 11 వరకూ ఈ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. అతనితోపాటు మరికొందరు ప్లేయర్స్ శుక్రవారం (మే 26) లండన్ లో అడుగుపెట్టారు. ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైన టీమ్స్ ప్లేయర్స్.. ముందుగానే ఫైనల్ కోసం లండన్ వెళ్లారు.
శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ సెల్ఫీ దిగి పోస్ట్ చేశాడు. బ్లూ టీ షర్ట్, బ్లూ జాకెట్ లో అతడు కనిపించాడు. క్రికెట్ టూర్ కోసమే కాకుండా కోహ్లి తరచూ యూకే వెళ్తూనే ఉంటాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు కూడా భార్య అనుష్క శర్మతో కలిసి అతడు యూకే వెకేషన్ కు వెళ్లాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు కోహ్లి టాప్ ఫామ్ లో ఉండటం టీమిండియాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.
ఆర్సీబీ ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరకపోయినా.. కోహ్లి మాత్రం 14 మ్యాచ్ లలో 639 పరుగులు చేశాడు. రెండు వరుస సెంచరీలు చేయడం విశేషం. ఇక ఆరు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2013 తర్వాత తొలి ఐసీసీ ట్రోఫీ కోసం చూస్తున్న ఇండియాకు కోహ్లి ఫామ్ కలిసొచ్చేదే.
ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఎలాగైనా గెలవాలని చూస్తున్నట్లు విరాట్ చెప్పాడు. ఈ ఫైనల్ ను దృష్టిలో ఉంచుకొనే తాను ఐపీఎల్లో ఫ్యాన్సీ షాట్లు ఆడలేదని కూడా తెలిపాడు. "నా వరకూ ఫ్యాన్సీ షాట్లు ఆడి వికెట్ పారేసుకోవడం ఇష్టం ఉండదు. ఐపీఎల్ తర్వాత టెస్ట్ క్రికెట్ వస్తోంది. అందుకే నా టెక్నిక్ కు అనుగుణంగానే ఆడతాను" అని కోహ్లి స్పష్టం చేశాడు.
ఇంగ్లండ్ లో ఇప్పటి వరకూ 16 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లి 1033 రన్స్ చేశాడు. అందులో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు ఫైనల్లో ఆడబోయే ఆస్ట్రేలియాపై కూడా కోహ్లికి మంచి రికార్డు ఉంది. టెస్ట్ కెరీర్ లో ఆస్ట్రేలియాపైనే 24 మ్యాచ్ లలో అత్యధికంగా 1979 రన్స్ చేశాడు. అందులో 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సంబంధిత కథనం