IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ టికెట్ల కోసం ఫ్యాన్స్ యుద్ధం.. నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర గందరగోళం
IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ టికెట్ల కోసం ఫ్యాన్స్ యుద్ధం చేశారు. దీంతో నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీసీసీఐపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
IPL 2023 Final: ఐపీఎల్ 2023 ఫైనల్ జరగబోయే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఐపీఎల్ ఫైనల్ ను ప్రత్యక్షంగా చూడటానికి ఉత్సాహం చూపిస్తున్న ఫ్యాన్స్.. పెద్ద సంఖ్యలో స్టేడియం దగ్గరికి వచ్చారు. నిజానికి టికెట్లన్నీ ఆన్‌లైన్ లోనే పేటీఎం ద్వారా అమ్ముతున్నారు.
అయితే ఆన్‌లైన్ లో బుక్ చేసుకున్నా.. ఆ టికెట్లను స్టేడియం దగ్గర కలెక్ట్ చేసుకోవాలని నిర్వాహకులు చెప్పారు. దీంతో తమ టికెట్ల కోసం ఫ్యాన్స్ స్టేడియం ముందు క్యూ కట్టారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో గందరగోళం నెలకొంది. కౌంటర్ దగ్గరికి వెళ్లడానికి పోటీ పడటంతో ఒకరినొకరు తోసుకుంటూ, కింద పడుతూ అభిమానులు నానా తంటాలు పడ్డారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆన్‌లైన్ లో కన్వేయెన్స్ ఫీజు చెల్లించన తర్వాత కూడా ఇలా స్టేడియం దగ్గర ఫిజికల్ గా టికెట్ తీసుకోవాలన్న నిబంధనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ టికెట్ లేకపోతే ఆన్‌లైన్ లో బుక్ చేసుకున్నా.. మ్యాచ్ చూసే అవకాశం ఉండదని చెప్పడంపై వాళ్లు గుర్రుగా ఉన్నారు.
ఇక స్టేడియం దగ్గర టికెట్ కౌంటర్లలోనూ ఎన్నో టికెట్లు మిస్ అయినట్లు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. కౌంటర్ తెరిచిన క్షణాల్లోనే టికెట్లు మాయమైనట్లు కొందరు ట్విటర్ లో ఆరోపించారు. ఇప్పటికే ఫైనల్ కు చెన్నై సూపర్ కింగ్స్ చేరడంతో టికెట్లకు మరింత డిమాండ్ పెరిగింది. ధోనీని ప్రత్యక్షంగా చూడటానికి ఫ్యాన్స్ ఉత్సాహం చూపుతున్నారు.
సీఎస్కేతో ఫైనల్లో తలపడబోయే టీమ్ ఏదో శుక్రవారం (మే 26) తేలనుంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగే రెండో క్వాలిఫయర్ విజేతతో సీఎస్కే ఫైనల్లో తలపడనుంది.
సంబంధిత కథనం