AB de Villiers on IPL 2023: నేను చూసిన బెస్ట్ ఐపీఎల్ ఇదే: డివిలియర్స్
AB de Villiers on IPL 2023: నేను చూసిన బెస్ట్ ఐపీఎల్ ఇదే అని అన్నాడు ఏబీ డివిలియర్స్. మంగళవారం (మే 23) చెన్నై, గుజరాత్ మధ్య తొలి క్వాలిఫయర్ ప్రారంభానికి ముందు అతడు మాట్లాడాడు.
AB de Villiers on IPL 2023: ఈ సీజన్ ఐపీఎల్ అభిమానులందరినీ ఎంతగానో అలరించిందనడంలో సందేహం లేదు. భారీ స్కోర్లు, చేజింగ్ లు, సెంచరీలు, సిక్స్ లతో మార్మోగిపోయింది. ఇవి అభిమానులనే కాదు.. లెజెండరీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ను కూడా బాగానే ఆకట్టుకున్నాయి. అందుకే తనకు ఇదే బెస్ట్ ఐపీఎల్ అని అంటున్నాడతడు.
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ మధ్య తొలి క్వాలిఫయర్ కు ముందు జియో సినిమాలో డివిలియర్స్ మాట్లాడాడు. "నేను చూసిన వాటిలో ఇదే బెస్ట్ ఐపీఎల్ సీజన్" అని ఏబీ అనడం విశేషం. నిజానికి ఈ ఏడాది లీగ్ స్టేజ్ లో ఎన్నో ఆల్ టైమ్ రికార్డులు బ్రేకయ్యాయి. అత్యధిక సెంచరీలు, అత్యధిక సిక్స్‌లు, అత్యధిక 200 ప్లస్ స్కోర్లు, అత్యధిక 200 ప్లస్ చేజింగ్ లు ఈసారి నమోదయ్యాయి.
అభిమానులు పరుగుల వర్షంలో తడిసి ముద్దయ్యారు. ఈ భారీ స్కోర్లు సీజన్ లో చివరి లీగ్ మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ప్లేఆఫ్స్ నాలుగో బెర్త్ ఖరారు కాలేదు. ఎన్నో చివరి ఓవర్ ఫినిష్ లు ఫ్యాన్స్ ను ఉత్కంఠకు గురి చేశాయి. చివరి రోజు సన్ రైజర్స్ ను ఓడించడంతోపాటు గుజరాత్ చేతుల్లో ఆర్సీబీ ఓడటంతో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ నాలుగో జట్టుగా క్వాలిఫై అయింది.
విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ లాంటి వాళ్లు రెండేసి సెంచరీలు కొట్టారు. మొత్తంగా లీగ్ స్టేజ్ లోనే 11 సెంచరీలు నమోదయ్యాయి. 1063 సిక్స్ లు బాదారు. యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. 35సార్లు జట్లు 200కుపైగా స్కోర్లు చేశాయి. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లోనే నాలుగుసార్లు 200కుపైగా రన్స్ చేజ్ చేసి గెలిచింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకు సింగ్ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్ లు కొట్టి గెలిపించడం ఈ సీజన్ కే హైలైట్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఐపీఎల్లో గ్రౌండ్ నలుమూలలా షాట్లతో 360 డిగ్రీ ప్లేయర్ గా పేరుగాంచిన డివిలియర్స్.. ఈసారి ఐపీఎల్ చూసి ఫిదా అయ్యాడు. అయితే తాను గతంలో ఆడిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరకపోవడం మాత్రం అతనికి నిరాశ కలిగించింది.
సంబంధిత కథనం