Virat Kohli Heartfelt Note: 'నిరాశ కలిగించాం.. కానీ నిలబడాలి'.. RCB ప్లేఆఫ్స్ నిష్క్రమణ తర్వాత కోహ్లీ ఎమోషనల్ పోస్ట్
Virat Kohli Heartfelt Note: ఆర్సీబీ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ పరాజయంతో అభిమానులు మరోసారి నిరాశకు గురవుతున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ ఆర్సీబీ అభిమానులను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
Virat Kohli Heartfelt Note: ఐపీఎల్ టైటిల్ ఒక్కసారైనా ముద్దాడాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభమై 16 ఏళ్లు కావొస్తున్న ఆ కోరిక మాత్రం తీర్చుకోలేకపోయింది బెంగళూరు. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జట్టు ఐపీఎల్ 2023లోనూ ప్లేఆఫ్స్‌కు చేరకుండానే నిష్క్రమించింది. దీంతో ఆర్సీబీ అభిమానులకు మళ్లీ నిరాశే కలిగించింది. కోహ్లీ ఫామ్ పుంజుకుని అద్భుతంగా ఆడినప్పటికీ తన జట్టు కలను సాకారం చేయలేకపోయాడు. దీంతో అభిమానులను ఉద్దేశిస్తూ విరాట్ కోహ్లీ ఓ ఎమోషనల్ పోస్టును పెట్టాడు. ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించామంటూ తన పోస్టులో పేర్కొన్నాడు.
"ఇది కొన్ని మరపురాని క్షణాలను కలిగి ఉన్న సీజన్. కానీ దురదృష్టవశాత్తూ మేము మా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. నిరాశ చెందినా మనం తలెత్తుకుని నిలబడాలి. మాకు అడుగడుగునా మద్దతు ఇస్తున్న మా నమ్మకమైన మద్దతుదారులకు కృతజ్ఞతలు" అని విరాట్ కోహ్లీ తన పోస్టులో పేర్కొన్నాడు.
ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌తో ఆడాడు. తన ప్రదర్శనతో అభిమానులను అలరించాడు. ఆర్సీబీ తరఫున తను ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ రెండు సెంచరీలు చేశాడు. ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 100 పరుగులు చేసిన కోహ్లీ.. అనంతరం గుజరాత్ టైటాన్‌పై కూడా కూడా శతకాన్ని సాధించాడు. మొత్తంగా ఈ సీజన్‌లో కోహ్లీ 14 మ్యాచ్‌ల్లో 53.25 సగటుతో 639 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు సహా 6 అర్ధ శతకాలు ఉన్నాయి.
ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో బెంగళూరు పరాజయం పాలైంది. 198 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది గుజరాత్. శుబ్‌మన్ గిల్ అద్భుత శతకంతో తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 52 బంతుల్లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు విజయ్ శంకర్(53) అర్ధశతకంతో చక్కటి సహకారం అందించడంతో గుజరాత్ సులభంగా గెలిచింది. అంతకుముందు ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటంతో అద్భుత సెంచరీ సాధించి ఐపీఎల్‌లోనే అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయినప్పటికీ ఆర్సీబీ బౌలర్లు చేతులెత్తేయడంతో గుజరాత్ సులభంగా విజయాన్ని అందుకుంది.