Karthik about Yashasvi: యశస్విని అప్పుడే వన్డే టీమ్‌లోకి తీసుకోవడం సరికాదు: దినేష్ కార్తీక్
Karthik about Yashasvi: యశస్విని అప్పుడే వన్డే టీమ్‌లోకి తీసుకోవడం సరికాదని అన్నాడు దినేష్ కార్తీక్. ఈ యువ క్రికెటర్ ను వరల్డ్ కప్ జట్టులోకి ఎంపిక చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్న వేళ కార్తీక్ ఈ కామెంట్స్ చేయడం విశేషం.
Karthik about Yashasvi: ఈ ఏడాది ఐపీఎల్లో ఇండియన్ క్రికెట్ కు దొరికిన మరో ఆణిముత్యం యశస్వి జైస్వాల్. నిజానికి గత రెండేళ్లుగా అతడు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఉన్నా పెద్దగా రాణించలేదు. కానీ ఐపీఎల్ 2023లో మాత్రం చెలరేగాడు. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో రికార్డు క్రియేట్ చేయడంతోపాటు సెంచరీ కూడా చేశాడు.
దీంతో జైస్వాల్ ను వన్డే వరల్డ్ కప్ కు ఎంపిక చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే దినేష్ కార్తీక్ మాత్రం ఈ అభిప్రాయాలతో విభేదించాడు. తొందరపడి అతన్ని వన్డే జట్టులోకి తీసుకోకూడదని స్పష్టం చేశాడు. ఈ యువ ప్లేయర్ ను టీ20 జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. 21 ఏళ్ల యశస్వి జైస్వాల్ ఈ ఏడాది 14 మ్యాచ్ లలో 48 సగటుతో 625 పరుగులు చేశాడు.
అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 124. అతని ఆట చూసిన గవాస్కర్, రవిశాస్త్రిలాంటి మాజీ క్రికెటర్లు కూడా జైస్వాల్ ను వరల్డ్ కప్ టీమ్ కోసం పరిశీలించాలని సూచించడం గమనార్హం. తాజాగా ఐసీసీతో మాట్లాడిన దినేష్ కార్తీక్ వాదన మరోలా ఉంది. "వన్డే జట్టులోకి యశస్విని తీసుకోవడం సరికాదన్నది నా ఆలోచన" అని కార్తీక్ అన్నాడు.
"అతడో యువ ఆటగాడు. టీ20 జట్టులోకి అతన్ని తీసుకోవాలి. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప జట్టు కోసం రేసులో ఉన్న వాళ్లలో యశస్వి కూడా ఒకడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ కు ముందు పరిమిత స్థాయిలోనే వన్డేలు ఉన్నాయన్న విషయం గమనించాలి" అని కార్తీక్ చెప్పాడు. టీమిండియాలో అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కూడా సూచించాడు.
"యశస్వికి అవకాశం ఇస్తే ఎక్కువ కాలం ఇవ్వాలి. ఎందుకంటే అతడో ప్రత్యేకమైన ప్లేయర్. ఈ ఐపీఎల్లో అతడు అదే చూపించాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్ కు వచ్చేసరికి పూర్తి భిన్నంగా ఉంటుంది" అని కార్తీక్ అన్నాడు. టీ20 జట్టులో అతనికి అవకాశాలు కల్పిస్తూనే వెళ్లాలని, టీ20 వరల్డ్ కప్ ముగిసే సమయానికి అతడు రెగ్యులర్ గా వన్డేలు, టీ20లు ఆడేందుకు సిద్ధంగా ఉంటాడని కార్తీక్ చెప్పాడు.
సంబంధిత కథనం